Telangana Samagra Kutumba Survey | హైదరాబాద్: తెలంగాణలో కుల గణన ప్రక్రియ ముగిసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనేది తేలింది. తెలంగాణలో అత్యధికంగా 46.25 శాతం బీసీలు ఉన్నారు. ఆతరువాత ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం మంది ప్రజలు ఉన్నారని సమగ్ర సర్వేతో ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే (Telangana Caste Survey)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే రిపోర్టును మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరగనుంది.
పిబ్రవరి 4న కేబినెట్ ఆమోదం
తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న బీసీ ఉపసంఘానికి ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి, నోడల్ అధికారి సమగ్ర సర్వే నివేదికను ఆదివారం అందజేశారు. అనంతరం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేయడంలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వేతో చారిత్రక అడుగు పడింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చెప్పినట్లుగానే ఏడాదిలోగా సర్వే పూర్తి చేశాం. కుల గణన నివేదికను రూపొందించాం. సమగ్ర సర్వే నివేదికపై పిబ్రవరి 4న కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు అసెంబ్లీలో దీనిపై చర్చిస్తాం. తెలంగాణలోని అన్నివర్గాల వారికి ఉద్యోగ, రాజకీయ, ఇతర అన్ని రంగాలలో సమగ్ర న్యాయం జరుగుతుంది. సమగ్ర సర్వే నివేదిక వివరాలతో తెలంగాణలో అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని’ మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
రాహుల్ ఇచ్చిన హామీ మేరకు కుల గణన
ఇండిపెండెన్స్ తరువాత 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల కోసం సర్వే చేసేవారు. కానీ కుల గణనను అందులో చేర్చలేదు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాదిలోనే సర్వే పూర్తి చేశాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుల గణన కోసం 2024 ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకోగా, అదే నెల 16న శాసనసభ తీర్మానం చేసింది. ఏడాదిలోపే సర్వే పూర్తి చేసి, నివేదికను రూపొందించా. దీనిని ఫిబ్రవరి 4న అసెంబ్లీకి ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకుంటాం.
సమగ్ర ఇంటింటి సర్వేలో 1,03,889 మంది పనిచేశారు. 96.9 శాతం మంది (3.54 కోట్ల మంది) వివరాలు సమర్పించగా కేవలం 50 రోజుల వ్యవధిలో సమగ్ర సర్వే నివేదిక వచ్చింది. సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, సర్వేకు దూరంగా ఉన్నవారు 3.1 శాతం (16 లక్షల మంది) ఉన్నారు. వేగంగా సర్వే పూర్తి చేసిన అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసిన వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. సర్వే సమయంలో 1.03 లక్షల గృహాలకు తలుపులు వేసి ఉండగా, 1.68 లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉండి వివరాలు ఇవ్వలేదు. బిహార్‌లో కులగణనకు 6 నెలలు సమయం పడితే, రూ.500 కోట్లు ఖర్చు అయింది. తెలంగాణలో కేవలం 50 రోజులలో అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందని’ ఉత్తమ్ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ ఇచ్చిన సిఫారసులపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శ్రీమతి సీతక్క, ఎంపీ శ్రీ మల్లు రవి సచివాలయంలో వివరాలు వెల్లడిస్తారు.