Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు, సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలాచరించారు. తాజాగా వసంత పంచమి సందర్భంగా మహా కుంభమేళాలో జరిగిన మూడవ గొప్ప 'అమృత స్నానం'లో, త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తోన్న సాధువులు, భక్తులపై హెలికాప్టర్ తో పూల రేకులను కురిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను మహా కుంభ్ అధికారిక ఎక్స్ ఖాతాలో వీక్షించవచ్చు. ఇందులో హెలికాప్టర్ గాల్లో విహరిస్తూనే.. గంగానదిలో స్నానాలచరిస్తోన్న వారిపై పూల వర్షం కురిపించడం చూడవచ్చు.






వసంతి పంచమి సందర్భంగా ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 62 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే రోజు ముగిసేరికి దాదాపు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతకుముందు జనవరి 29న మౌని అమావాస్యను పురస్కరించుకుని సంగం అంతా భక్తులు, సన్యాసులు, సాధువులతో కిక్కిరిసిపోయింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులు వివిధ ఘాట్ లలో స్నానాలు చేసి, సురక్షితంగా వెనుదిరిగారు.






వసంత పంచమి కోసం భారీ ఏర్పాట్లు


రోజురోజుకూ కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపవుతోంది. మరీ ముఖ్యంగా అమృత స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉండడంతో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలోని వార్ రూమ్‌లో వసంత పంచమి రోజున సాగే 'అమృత్ స్నాన్' గురించి ఉ.3.30 నుంటి నిరంతరం అప్‌డేట్ చేస్తూ, డీజీపీ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. అధికారులు ఆదేశాలను పాటించాలని సీఎం ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలనుసరించి వసంత్ పంచమి స్నానోత్సవం భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది.






Also Read : ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు