ISRO GSLV F15 NVS 02 satellite | ఇటీవల ఇస్రో చేపట్టిన ప్రయోగంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15/ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) బుధవారం ప్రయోగించింది. ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉపగ్రహంలోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్ చేరకపోవడంతో ఫైర్ కాలేదు. దాంతో నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడం సఫలం కాలేదని పీటీఐ రిపోర్ట్ చేసింది. శాటిలైట్‌ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టేందుకు  ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అని ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. జనవరి 29న ఉదయం ఇస్రో శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. కాగా, ఇస్రోకు ఇది 100వ ప్రయోగమని తెలిసిందే. 

ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం (NVS 02 Satellite) చాలా ముఖ్యం. దీన్ని జీఎస్‌ఎల్‌వీ ఎంకే2 (GSLV MK2) రాకెట్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు జనవరి 29న శ్రీహరికోట లాంచింగ్ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. జీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, అవి పెద్ద మంటలు వచ్చేలా బూస్టర్ ఫైర్ చేయాలి. కానీ ఆక్సిడైజర్‌ను ఇంజిన్లలోకి తీసుకెళ్లే వాల్వ్‌లు సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్ బూస్టర్స్ ప్రజ్వరిల్లలేదని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. 

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 ప్రయోగంపై ఆదివారం ఇస్రో ఈ అప్‌డేట్ ఇచ్చింది. ఇంజిన్ లోకి ఆక్సిడైజర్ ఎలా పంపాలి, మంటలు రావాలంటే ఏం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే, దాని ద్వారా శాటిలైట్ ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్‌వీ ఎంకే2 శాటిలైట్ భూఅనువర్తిత బదిలీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇది అంత సరైన కక్ష కాదని, నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉండదని ఇస్రో తెలిపింది. శాటిలైట్ ఎల్లిప్టికల్ ఆర్బిట్ (Elliptical orbit)లో పరిభ్రమిస్తోందని, దానికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.