BRS MLC Kavitha met KTR: న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిరోజు విచారణ ముగిసింది. సీబీఐ స్పెషల్ కోర్టు వారం రోజులు కస్టడీకి ఇవ్వడంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను తొలిరోజు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు పలు అంశాలపై కవితను ప్రశ్నించారు. కవిత కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలను చూపించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 


తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్‌తో పాటు సోదరుడు కేటీఆర్, హరీష్ రావు కలుసుకుని పరామర్శించారు. విచారణకు సంబంధించిన విషయాలు, కేసు అంశంతో పాటు తాము ఏం చేయాలని చర్చించారు. ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో హైదరాబాద్ లో శుక్రవారం ఆమె నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, రోడ్డు మార్గంలో శంషాబాద్‌కు తరలించి.. అక్కడి నుంచి ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించారు. శుక్రవారం రాత్రి కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.


కవితకు శనివారం ఉదయం డాక్టర్ల టీమ్ వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆమెను రౌజ్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీకి అనుమతించాలని కోరగా, కోర్టు కవితకు వారం రోజుల (మార్చి 23 వరకు) కస్టడీ విధించింది. ఆరోజు మధ్యాహ్నం మరోసారి కోర్టులో కవితను హాజరుపరచాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.