Prajagalam Public Meeting at Chilakaluripet: చిలకలూరిపేట: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. మోదీ ఒక వ్యక్తి కాదు.. భారత్ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని, మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మన కూటమికి అండగా ఉంటామని సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.


జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే..
‘మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి ప్రధాని మోదీ. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పారు మోదీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రధాని మోదీ నినాదాలు. పేదరికం లేని భారత్ అనేది మోదీ కల అని మనకు తెలుసు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోదీ ఆశయాలతో మనమంతా ఏకం కావాలి. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత ప్రధాని అయ్యారు’ - చంద్రబాబు 




3 ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించిన జగన్ 
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం అన్నారు. గతంలో కేంద్రం సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయగా.. అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఈ ప్రజాగళం సభ. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు ఏపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. వైసీపీ పాలనలో గత ఐదేళ్లలో విధ్వంసం జిరగింది, ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి కనుక ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మూడు పార్టీలు జత కట్టాయని కూటమి ఆవశ్యకతను చంద్రబాబు వివరించారు.



జగన్ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు! 
వైసీపీ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారు. మరికొందర్ని వైసీపీ ప్రభుత్వం తరిమేసింది. టీడీపీ, జనసేన నేతలతో పాటు తనపై సైతం అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసిన ఘనుడు వైఎస్ జగన్. ఇసుక, మైనింగ్, భూములు ఇలా అన్నింటిని దోచేశారు. సీఎం జగన్ అధికార దాహానికి ఆయన బాబాయ్‌ వివేకా బలయ్యారు. జగన్‌ ఇద్దరు చెల్లెళ్లు సైతం రోడెక్కి తన సోదరుడికి, వైసీపీకి ఓటు వేయొద్దని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. 400+ సీట్లతో దేశంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రం నుంచి 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మనపై ఉంది. - చంద్రబాబు