కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్ జారీచేసింది. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం తెలిపింది. ఈ విషయంపై గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలు అయ్యేలా కార్యాచరణ రూపొందించి పంపాలని సూచించారు. ఈ వ్యవహారంపై 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు, మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కమిటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు ఉన్నారు.
గెజిట్, ఇతర అంశాలపై అభ్యంతరాలను తెలంగాణ, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈ దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుని, మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరు రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ తెలంగాణ లేఖరాసింది. అలా అయితే బోర్డు సమావేశానికి హాజరవ్వగలమని చెప్తూ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు ఏపీ కూడా గెజిట్‌లో కొన్ని సవరణలు చేయాలని చెప్తూ, అవి జరిగితేనే ముందుకు వెళ్తామని చెప్పింది. ఈ సమయంలో బోర్డు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంపై ప్రాధాన్యత ఏర్పడింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని చెప్పింది. తెలంగాణ ఈఎన్‌సీ తన లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేసింది.
మరో తేదీ ఖరారు చేయండి : తెలంగాణ
గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని లేఖలో తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని స్పష్టంచేశారు. బోర్డు భేటీకి మరో తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశం ఏర్పాటుచేయాలని కోరింది.