తెలంగాణ రాష్ట్ర సమితి తరపున హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ తీసుకున్నారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుండి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. పార్టీని చక్కదిద్దుతున్నారు. అయితే హఠాత్తుగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దృష్టి పెట్టిందనే ప్రచారం ఊపందుకుంది. విచారణ కూడా జరుగుతున్నట్లుగా తేలింది. దానికి సంబంధించిన ఈడీ ఆదేశాలు వెలుగులోకి రావడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. 


గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. ఆయనకు పలు చోట్ల మైనింగ్ వ్యాపారం ఉంది. "శ్వేత" పేరుతో ఆయన కుటుంబం కొన్ని కంపెనీలు నిర్వహిస్తోంది. మరికొన్ని గ్రానైట్ కంపెనీల్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని .. ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. అనుమతులు తీసుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వేసి.. గ్రానైట్‌ను విదేశాలకు తరలించారని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వం ఈ అక్రమాలను నిర్ధారించి..  ఫైన్ విధించిందని.. వాటిని చెల్లించకుండా.. మరో మోసానికి పాల్పడ్డారని ఈడీకి పంపిన ఫిర్యాదుల్లో కొంత మంది ఆధారాలు కూడా ఇచ్చారు. ఫిర్యాదు అందడం ఆలస్యం.. ఈడీ కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై ఫెమా చట్టం కింద విచారణ ప్రారంభించింది.  


ఈడీకి అందిన ఫిర్యాదు ప్రకారం కరీంనగర్ గ్రానైట్ కంపెనీల అక్రమాలు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్నాయి. అప్పట్లోనే ప్రభుత్వం విచారణ జరిపి... ఏ కంపెనీ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. అన్ని కంపెనీలకు కలిపి దాదాపుగా రూ. 750 కోట్ల జరిమానా విధించారు. అయితే మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోవడంతో  వారి వ్యాపారం అలా కొనసాగుతూ వవచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి పెనాల్టీని ప్రభుత్వం తగ్గించింది. అయినా ఆ మొత్తం కూడా చెల్లించకుండా... కేవలం రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించి..  వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అక్రమాలపై బండి సంజయ్ కూడా 2019లో ఈడీకి ఫిర్యాదు చేశారు. 


ఈడీకి ప్రాథమిక విచాణలో సాక్ష్యాలు లభించడంతో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించి గ్రానైట్‌ను విదేశాలకు తరలిస్తున్న షిప్పింగ్ కంపెనీకి సమాచారం కోసం లేఖ రాశారు. ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించారనే దగ్గర్నుంచి కంపెనీలకు సంబంధించిన ప్రతీ సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రి గంగులకు నేరుగా ప్రమేయం ఉన్న వ్యవహారం కావడంతో ఇప్పుడీ ఈడీ కేసు సంచలనం అవుతోంది. షిప్పింగ్ కంపెనీ మొత్తం సమాచారం ఇస్తే..  పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ కంపెనీలు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వందల కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ  ఎన్నికలు జరిగితే.. అక్కడ బీజేపీ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరగడం సహజమేనని.. ఇది కూడా అలాంటిదేనని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే గంగుల బృందానికి మాత్రం ఈడీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు.