కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ అతలాకుతలమైంది. షూటింగ్స్ ఆగిపోవడంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ వేవ్ తరువాత అన్ లాక్ లో భాగంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో 'క్రాక్', 'వకీల్ సాబ్' లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే సెకండ్ వేవ్ కారణంగా మరోసారి థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చాలా సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', బాలకృష్ణ 'అఖండ' లాంటి సినిమాలు మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాయి. 


రానా 'విరాటపర్వం', నాగచైతన్య 'లవ్ స్టోరీ', నాని 'టక్ జగదీష్' లాంటి సినిమాలు ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి. అన్ని సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ల్యాబ్ లో ఉన్నాయి. థియేటర్లు తెరుస్తారని.. టికెట్ రేట్ల ఇష్యూ ఓ కొలిక్కి వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదు. కొన్ని రోజులుగా 'టక్ జగదీష్' సినిమా ఓటీటీలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఓ పక్క నిర్మాణ సంస్థ.. మరోపక్క నాని చెబుతూనే ఉన్నారు. 


రీసెంట్ గా 'SR కళ్యాణమండపం' సినిమా ఈవెంట్ కి అతిథిగా వచ్చిన నాని.. పరోక్షంగా తన సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా కోసం తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకుంటున్నారు. 


అసలు పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియదు. అందుకే ఓటీటీ దారిలోకి వెళ్లక తప్పడం లేదు. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని ఇన్నాళ్లుగా ఓపికగా ఎదురుచూశారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ సీజన్ లో నాని నటించిన 'వి' సినిమాను ఓటీటీకే ఇచ్చారు. వెంటనే మరో సినిమాను కూడా ఓటీటీకి ఇవ్వడం ఇష్టం లేక హీరో నాని ఇన్నాళ్లు ఆపుతూ వచ్చారు. 


కానీ ఇప్పుడు రాను రాను నిర్మాతలకు వడ్డీలు భారం పెరిగిపోతుండడంతో ఇక నాని కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఓటీటీ డీల్ ను పూర్తిచేసే పనిలో పడ్డారు నిర్మాతలు.  అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు శివ నిర్వాణ మైత్రి మూవీస్ బ్యానర్ పై సినిమా చేయనున్నారు.