Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. బుధవారం నల్గొండలో ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హస్తం గుర్తు జెండా ఎగురవేస్తుందన్నారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించిన కోమటి రెడ్డి కాంగ్రెస్‌ 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందన్నారు. అధికారంలోకి వచ్చేది తామేనని, కేసీఆర్, కేటీఆర్ అవినీతి లెక్కలు తేలుస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా కాకుండా ఓ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 


అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ నెలకు 15 రోజులు విదేశాల్లో ఉంటున్నాడని విమర్శించారు. విదేశాల్లో తిరిగే కేటీఆర్‌కు తెలంగాణ ప్రజల అవసరం ఏం తెలుస్తుందన్నారు. రాష్ట్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర లేదని అంటున్న కేటీఆర్ బలుపు అన్నారు. సోనియాగాంధీ దయవల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బానిసత్వ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ మధ్య సఖ్యత లేదని వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.


నల్లగొండ జిల్లా ఎస్ఎల్‌బీ‌సీ సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి పవర్ లేని ఓ పవర్ మంత్రి అని, అతని గురించి మాట్లాడే అవసరం లేదన్నారు. కొడుకుకు టికెట్ రాక సుఖేందర్‌రెడ్డికి మెదడు పనిచేయడం లేదని, చిప్ దొబ్బిందన్నారు. తనను తిడితే సీటు రాదని, వెళ్లి  కేసీఆర్‌తో తాడో పేడో తేల్చుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేవన్నారు. ఇప్పటికే తమకు లీడర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, కొత్తవారికి అవకాశం లేదన్నారు.


కాంగ్రెస్ పార్టీలోని క్యారెక్టర్ లేని వారిని పార్టీలోకి ఆహ్వానించమని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. నల్గొండలో మెయిన్ రోడ్డు వేసినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టా అంటూ ప్రశ్నించారు. మంది కొంపలు ముంచుడు అభివృద్ధి అని చెప్పడం బీఆర్‌ఎస్‌కు అలవాటు అన్నారు. గురువారం నుంచి నల్లగొండలో ప్రచారం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. గతంలో కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నల్లగొండలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని పైకి వైరం నటిస్తూ పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. 


నీరు లేని బావిలో దూకి చావాలంటూ జగదీశ్వర్ రెడ్డిపై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒట్టే జానయ్య ఉట్టి జానయ్య కాదని, గట్టి జానయ్య అన్నారు. జగదీశ్వర్ రెడ్డికి జానయ్య సినిమా చూపిస్తారని అన్నారు. 17న జరిగే సోనియా గాంధీ విజయభేరి సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలలో స్థానిక లీడర్లకు కమీషన్లు హైకోర్టుకు వెళ్తామన్నారు. ఒకటో తారీకు జీతాలు వేయలేని ప్రభుత్వం ప్రతిపక్షాలను విమర్శించే స్థాయి ఉందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుస్తామన్నారు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారని అన్నారు.