KomatiReddy gave an explanation on the PCC chief issue:  తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు రావడంతో, కోమటిరెడ్డి  దీనిపై వివరణ ఇచ్చారు.  

Continues below advertisement

 నా మాటలను వక్రీకరించారు" సంగారెడ్డిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని ఆయన అనడం, ప్రస్తుతం పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ను కించపరచడమేనని పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

మహేష్ కుమార్ గౌడ్‌తో స్నేహం 

Continues below advertisement

ఈ వివాదంపై స్పందించిన కోమటిరెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాకు ఎన్ఎస్‌యూఐ రోజుల నుండి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన సారథ్యంలోనే   గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం  అని ఆయన ప్రశంసించారు. మహేష్ కుమార్‌పై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

జగ్గారెడ్డిపై వ్యాఖ్యల వెనుక ఉద్దేశం 

సంగారెడ్డి కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కోమటిరెడ్డి వివరించారు. అక్కడ జగ్గారెడ్డి చేసిన జనసమీకరణ, కార్యక్రమ నిర్వహణ తీరు చూసి ముగ్ధుడనై, భవిష్యత్తులో ఆయనకు పీసీసీ అయ్యే అర్హత ఉందని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిని తొలగించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, జగ్గారెడ్డి పనితీరును మెచ్చుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ వివరణతో పీసీసీ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య ఉన్న అంతర్గత పోటీ మరోసారి బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి వివరణతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.