Komatireddy VenkatReddy :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ సోదాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు.  కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ ఓ డ్రామా అని  ఇదంతా మోదీ, అమితాషా నాటకలేనని విమర్శించారు.  బీజేపీని ప్రజలు నమోద్దని చెప్పారు.  నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ సిబ్బందికి శానిటేషన్ కిట్స్ పంపిణీ అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.   లిక్కర్ స్కామ్ లో సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడే కవితనూ అరెస్ట్ చేయాల్సింది కాదా అని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. 


తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని బీజేపీ ఆశపడుతుంది.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చని ఆరోపించారు. గల్లీలో కొట్లాడుకొని ఢిల్లీలో కలిసిపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో  ఈడీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల సందర్భంగా కవితతోపాటు ఆమె భర్తకు సంబంధించిన వ్యాపారాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల  కారణంగా కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.  ఇంట్లోనే కవితో పాటుగా ఆమె భర్త అనిల్ ఉన్నారు.  కవిత  ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. 


సుప్రీంకోర్టులో కేసు ఉన్నా.. సోదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు  కవిత న్యాయవాది సోమా భరత్.  కవితను కలవడానికి వెళ్తే లోపలికి అనుమతించట్లేదని చెప్పారు.  సోదాలు ముగిసిన తర్వాత కవితను కలవండని ఈడీ అధికారులు తనకు సూచించినట్లుగా వెల్లడించారు.  సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా?  తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది.  ఈ టైంలో ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు.   ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు.  కవిత ఇంట బయటే సోమ భరత్  వెయిట్ చేస్తున్నారు.  మరోవైపు  సోదాలు జరుగుతున్నంత సేపు ఇంట్లోకి ఎవరిని అనుమతించవద్దని సీఆర్పీఎఫ్ జవాన్లకు ఈడీ అధికారులు ఆదేశించారు. 


కవిత ఇంట్లో సోదాలపై  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.