Komatireed Meet MOdi :  భవనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు.  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపైనే ప్రధానితో చర్చించానని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, విజయవాడ హైవే విస్తరణ, యాదాద్రి కి ఎంఎంటీఎస్ పొడిగింపుతో పాటు భువనగిరి కోటకు రోప్ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాజకీయాల గురించి తమ మధ్య చర్చ జరగలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.


వెంకటరెడ్డి సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో.. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీతో భేటీ  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. గతంలోనే వర్గాలుగా విడిపోయి.. అంతర్గత పోరుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కు వేదికగా మారింది. ప్రధానితో  భేటీలోరాజకీయాలు మాట్లాడే ఉంటారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని గతంలో చెప్పారు. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న సమయంలో ఆయన ప్రధానిని కలవడం లు చర్చనీయాంశంగా మారింది.  ఒక ఎంపీగా ప్రధానితో సమావేశం జరగడం కామన్ అని కోమటిరెడ్ది సన్నిహితులు చెబుతున్నారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం  ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఖర్గేకు వివరించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.


మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనలేదు. రాహుల్ పాదయాత్ర తెలంగాణకు వచ్చిన  సమయంలో ... కోమటిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కానీ.. ఆయన పాల్గొనే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి మాత్రం తరచూ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటానని... కోమటిరెడ్డి చెబుతున్నారు. 


హీరోయిన్ రకుల్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు ఈడీ పిలుపు - రీ ఓపెన్ అయిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు !