Komaram Bheem News : బైక్ కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో జరిగింది. బెజ్జూర్ ఎస్సై ఎస్. వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం... కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నికాడి విజయ్ (24) అనే యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విజయ్ ని కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు విజయ్ తండ్రి నికాడి లింగయ్య తెలిపారు. విజయ్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. విజయ్ మృతదేహాన్ని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.
మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏసీ ట్రాలీ - లారీ ఢీకొని ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కూలీలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు తాండూరు మండలం బోయపల్లి బోర్డుకు చెందిన శంకర్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కూలీలు మందమర్రిలో కూలి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వెళ్తోన్న టాటాఏసీ వాహనాన్ని వెనుకవైపు నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై డివైడర్ మూలమలుపు ఉండడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హైవే పనుల కోసం అనుభవం లేని డ్రైవర్లను ఫిట్నెస్ లేని వాహనాలను పనులకు వాడుతుండడం వలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
భార్య వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది. అయితే పెళ్లయిన దగ్గర నుంచి కవన తరచూ భర్తతో గొడవ పడేదని స్థానికులు తెలిపారు. ఆమె వేధింపులు తట్టుకోలేక మహేశ్వర ఐదు రోజుల క్రితం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్య వేధింపులు తట్టుకోలేకే మహేశ్వర ఆత్మ హత్య చేసుకున్నట్లు అతని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు.