నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్‌ తమిళిసై నిర్ణయం సరైందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సదరు కోటాలో కవులు, కళాకారులు లేదా సామాజిక సేవ చేసేవారికి గవర్నర్‌ అవకాశం కల్పిస్తారని చెప్పారు. కానీ, ఇక్కడ సీఎం కేసీఆర్‌ మాత్రం తన రాజకీయ లాభం కోసం క్రిమినల్‌ కేసులు ఉన్న వారిని ఎంపిక చేసి వారి పేర్లు పంపారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌తో కలిసి కిషన్‌ రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 25) మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం కోసం పని చేసేవారికి మాత్రమే ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ కు వత్తాసు పలికితే మంచివారు.. లేదంటే చెడ్డ వాళ్ళా అని ఆయన ప్రశ్నించారు.


పార్టీలు ఫిరాయించిన వారిని, కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వారిని గవర్నర్‌ తిరస్కరించడం మంచి నిర్ణయమని అన్నారు. కేసీఆర్‌కు వత్తాసు పలికితే మంచివారు.. లేదంటే చెడ్డ వాళ్లా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ పేర్లను కేబినెట్ ఆమోదించి రాజ్ భవన్‌కు పంపగా, అధికార బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తమిళిసై పై భగ్గుమంటున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించారు. 


కవులు, కళాకారులు, సేవ చేసే వారికి గవర్నర్ లేదా రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారని.. అలాగే సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆయనతో పాటు పరుగుల రాణిగా పేరుగాంచిన పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేశారని గుర్తు చేశారు. బీజేపీకి సంబంధం లేని వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ నామినేట్ చేశారని చెప్పారు. గవర్నర్ ఆమె కుర్చీకి ఉన్న అధికారాలతో న్యాయంగా వ్యవహారించారు కాబట్టే.. ఎమ్మెల్సీలను తిరస్కరించారని అన్నారు.


మంత్రి వేముల స్పందన


తెలంగాణ గవర్నర్‌ తమిళిసై గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గవర్నర్ తీరును తప్పుబట్టారు. మంత్రి ప్రశాంత్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందర రాజన్‌కి లేదని అన్నారు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే గవర్నర్ తిరస్కరించడం ఏంటని మండిపడ్డారు. వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. 


అత్యంత వెనుక బడిన కులాలకు (ఎంబీసీ) చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్ అని.. షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టేనని అన్నారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.