Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. అయితే చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభించకపోవడం, జైలు నుంచి బయటకు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాలుగో విడత వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ పర్యటించనున్నారు.  


అవనిగడ్డలో వారాహి యాత్ర ప్రారంభం కానుండగా.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి యాత్ర ఏర్పాట్లపై జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. వారాహి యాత్రకు ఏర్పాట్లు మొదలుపెట్టాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వారాహి యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. బహిరంగ సభలకు ఏర్పాట్లు, పోలీసుల అనుమతి తీసుకోవాలని నేతలను సూచించారు.


అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వారాహి యాత్ర పవన్ చేపట్టనున్నారు. యాత్రలో భాగంగా పలు నియోకవర్గాల్లో పవన్ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన పవన్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. నారా లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణితో భేటీ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. 


చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీతో పొత్తుపై పవన్ అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఇప్పటినుంచి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ను ఓడించలేమని, అందుకే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్, బాలకృష్ణ సమక్షంలో స్పష్టం చేశారు. మరుసటి రోజు జనసేన కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో సోషల్ మీడియాలో పొత్తు గురించి నెగిటివ్ కామెంట్స్ ఎవరూ పెట్టవద్దని, టీడీపీ నేతలను విమర్శించవద్దని తెలిపారు. పొత్తుకు అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ 40  ఏళ్ల నుంచి ఉన్న పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు.


చంద్రబాబు అరెస్ట్ క్రమంలో పవన్ వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ గురించి పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మూడు విడతల వారాహి యాత్రలో వాలంటీర్స్ టార్గెట్‌గా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలోని అవినీతి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు గురించి విమర్శలు చేశారు. అయితే ఈ సారి పవన్ ఎవరని టార్గెట్ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తుపై పవన్ ప్రకటన చేసిన క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొనే అవకాశముంది.