Chandrababu Bail Petition: 


విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు విచారణ చేపట్టింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏ పిటిషన్ పై విచారణ చేపట్టాలో పట్టుపట్టడంతో చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనంగా ఉన్నారు. ఓ వైపు బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు పట్టుపట్టగా, సీఐడీ లాయర్లు కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు.


ఈ నెల 14న బెయిల్ పిటిషన్ వేశామని ముందు ఈ పిటిషన్ విచారించాలని చంద్రబాబు లాయర్లు జడ్జిని పదే పదే కోరారు. కస్టడీ పిటిషన్ పై సీఐడీ వేసిన మెమోపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు న్యాయమూర్తిని అడిగారు. మెమో ఇంకా తన దగ్గరకు రాకుండా ఎలా నిర్ణయం తీసుకుంటానంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టడీ పిటిషన్ విచారణలో ఉండగా బెయిల్ పిటిషన్ విచారణ జరగదని పలు కేసులను సీఐడీ తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో ప్రస్తావించారు. చంద్రబాబును అక్టోబర్ 5 వరకు మరో 11 రోజులవరకు రిమాండ్ విధించడం తెలిసిందే. 


చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం ఉదయం సీఐడీ న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేశారు. ఇందులో వివరాలు అంతగా లేవని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం దీనిపై వాదనలు తిరిగి ప్రారంభం కాగా, మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ లాయర్లు కోర్టును కోరారు. అయితే ముందుగా బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు లాయర్లు పట్టుపట్టడంపై ఏసీబీ కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఏది ముందుగా విచారణ చేపట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన తరువాత ఉత్తర్వులు ఇస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది.