Kishan Reddy Visited Veyyi Sthambhala Temple: కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని.. వేయి స్తంభాల గుడి కట్టేందుకు 72 ఏళ్లు పట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం వేయి స్తంభాల గుడిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో పునఃనిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో శాంతి హోమం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏఎస్ఐ అధికారులు తమ పరిధి, పరిమితుల మేరకే పని చేస్తారని.. వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని అన్నారు. దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదన్నారు. వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
1324 - 25లో తుగ్లక్ సైన్యం దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసం అయ్యిందని.. సూర్య, వాసుదేవ విగ్రహాలను సైతం తుగ్లక్ సైన్యం తీసుకెళ్లిందని కిషన్ రెడ్డి అన్నారు. 'మధ్యయుగం కాలంనాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లో కూల్చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను. 2006 నుంచి దీని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా అది నత్తనడకన సాగింది. వెయ్యి స్తంభాల మండపం పునరుద్ధరణ ఓ ఛాలెంజింగ్ టాస్క్.' అని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టాకు ఏఎస్ఐకు నిధులు వచ్చాయని.. దీంతో పనులు వేగవంతం అయ్యాయని చెప్పారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న కళాకారులను తీసుకురావడం, వారి సహాయంతో డాక్యుమెంటేషన్ ఆధారంగా ఆలయ పునరుద్ధరణ ప్రక్రియ పూర్తైందని చెప్పారు. ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో బ్లాక్ గ్రానైట్ తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను తయారు చేశారని వివరించారు. నిర్మాణం దాదాపుగా పూర్తైందని మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు అంకితం చేయాలనే నేడు ప్రారంభోత్సవం చేశామన్నారు.
ప్రత్యేక ఫోకస్
వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలిగించిన పురావస్తు అధికారులు 2006 నుంచి పనులు చేపట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తవుతాయని భావించినా అలా జరగలేదు. ఈ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తు శాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు మంజూరు కాగా.. ఆయన పనులు మొదలుపెట్టారు. అయితే, నిధులు సరిగ్గా విడుదల కాక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఈ పనులకు మోక్షం కలగలేదు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం గతంలో ఖర్చైన నిధులతో సంబంధం లేకుండా మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. దీంతో స్థపతి కుమార్ ఆధ్వర్యంలో మరో 70 మంది శిల్పులు పని మొదలుపెట్టారు. రెండేళ్లు శ్రమించి కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు.
Also Read: Sivaratri Celebrations: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ - ఆలయాలకు పోటెత్తిన భక్తులు