Sivaratri Celebrations in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర రామలింగేశ్వర ఆలయం, వేయిస్తంభాల గుడి, కోటిపల్లి, ద్రాక్షారామం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గోదావరి నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి అనుమతించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. మరోవైపు, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సైతం వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 11 వరకూ ఈ ఉత్సవాలు సాగనున్నాయి. శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు.  


ఏపీలోని బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి దర్శనానికి ఉదయం నుంచే పోటెత్తారు. అటు, కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో భక్తుల రద్దీ నెలకొంది. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.


కల్యాణ మండపం ప్రారంభం


మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ లోని వెయ్యి స్తంభాల ఆలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక  పూజలు నిర్వహించారు. అనంతరం వేయి స్తంభాల కళ్యాణ మండపంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సుమారు 17 ఏళ్ల తర్వాత పునః నిర్మించిన వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపాన్ని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.



అటు, వేములవాడ రాజన్న సన్నిధి భక్త జన సంద్రంగా మారింది. మూడు రోజుల జాతర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం తితిదే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించింది. వరంగల్ నగరంలోని సిద్ధేశ్వరాలయం, కురవి వీరభద్రేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఉదయం నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గోదారి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని పానగల్లు ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాల్లోనూ భక్తులు స్వామిని దర్శించి మారేడు దళాలతో పూజించారు. సూర్యాపేట పిల్లలమర్రి, మేళ్లచెర్వు స్వయంభు శంభు లింగేశ్వర ఆలయాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. చెర్వుగట్టు పార్వతీజడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి అగస్తేశ్వర స్వామి ఆలయాల్లోనూ ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని గుంటి మల్లన్న, తీర్థాల, కూసుమంచి, పెనుబల్లి, మధిరల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.


Also Read: AP Elections 2024: ఎన్నికల టైంలో 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే మీరు బుక్ అయినట్టే! సరకులకీ ఓ లెక్క ఉందండోయ్‌!