Kishan Reddy: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.డీలిమిటేషన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.డీలిమిటేషన్‌పై రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిన్నటి చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపించాయని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం తహతహలాడుతోందని.. దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పాత బంధం బయటపడిందని ఆయన అన్నారు.
డీలిమిటేషన్‌పై స్పష్టత
డీలిమిటేషన్ విధివిధానాలపై ఇంకా చర్చనే జరగలేదని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది ప్రజలకు అన్యాయం జరుగుతోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. తమిళనాడులో కుటుంబ, కుంభకోణ పాలన జరుగుతోందని ఆయన విమర్శించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడులో బీజేపీ మరింత బలపడుతోందని, కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు.
"తమిళనాడు సీఎం, తమిళనాడులోని కొన్ని పార్టీలు ఈరోజు చెన్నైలో సమావేశం నిర్వహించారు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, డీఎంకె అయినా , బీఆర్ఎస్ అయినా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన పై ఇంకా ఏదైనా చర్చ నిర్వహించిందా? తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 4.5ఏళ్లుగా పాలిస్తూ పూర్తిగా అవినీతిలో మునిగిపోయారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. దీనిని పక్కదారి పట్టించేందుకే బీజేపీని నిందించడం ద్వారా పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ పేరుతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు . సమస్య డీలిమిటేషన్, మాతృభాష లేదా స్థానిక భాషనా? అని నేను ప్రజలను అడగాలనుకుంటున్నాను. బీజేపీ అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంది' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమిళనాడులో డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రూ.700 కోట్ల లిక్కర్ స్కాంతో సహా పలు కుంభకోణాలు బయటపడడం ఆ వ్యతిరేకతను పెంచుతున్నాయన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు జాతీయ విద్య విధానంలో త్రిభాషా సూత్రాన్ని చూపి, హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.