Justice Yashwant Varma:ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో మంటలు చెలరేగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినపుడు కాలిపోయిన నగదు గుట్టలు బయటపడ్డాయి. సిట్టింగ్ జడ్జి అధికారిక నివాసంలో భారీ అగ్నిప్రమాదం తర్వాత నగదు కనుగొనడంతో వివాదం చెలరేగింది. సుప్రీంకోర్టు ఈ ఆరోపణలపై ఒక నివేదికను విడుదల చేసింది. ఇది శనివారం బహిర్గతమైంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయకు పంపిన కాలిపోయిన నగదు కట్టల ఫోటోలు, వీడియోలు ఈ నివేదికలో ఉన్నాయి.
25పేజీల నివేదిక
ఇక అగ్ని ప్రమాదం తర్వాత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణల పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలు ఫోటోలు, వీడియోల్లో ఉన్నాయి. వాటితో పాటు సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.
ఆరోపణలు అవాస్తవం
ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను ఓ సారి పరిశీలిస్తు సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం కూడా అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూంలో తాను గానీ, తనకు సంబంధించిన వ్యక్తులు గానీ ఎలాంటి నగదు ఉంచలేదనిసీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
సమగ్ర విచారణకు ఆదేశం
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటన మీద సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌లను సభ్యులుగా నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు.
హోలీ పండుగ రోజు రాత్రి 11:35 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని వార్తలు వచ్చాయి. కాలిపోయిన నోట్ల కట్టలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది.