Kishan Reddy: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. బీఆర్ఎస్ నయా నిజాం పాలనపై పోరాట చేస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందని.. రాబోయే ఎన్నికల్లే కేసీఆర్ సర్కారును ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేస్తామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఇచ్చిన హామీల నుంచి నైతికంగా రాజకీయాలు చేయడంలోనూ కేసీఆర్ సర్కారు వైఫల్యం చెందిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌజ్ కు పరిమితం చేస్తామని మండిపడ్డారు. జులై 9న మోదీ వరంగల్ కు వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వరంగల్ లో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని భూమి పూజ చేస్తారని.. అనంతరం వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
'హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ?'
ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 'గిరిజన బంధు అమలు ఏమైందో సీఎం చెప్పాలి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తామన్న హామీ అటకెక్కింది. రైతులకు రూ. లక్షల రుణమాఫీ ఎక్కడికి పోయిందో సీఎం చెప్పాలి. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ, పేదలకు ఇల్లు కట్టివట్లేదు. కేంద్రం సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదు. ఫలక్ నుమా వరకు నడవాల్సిన మెట్రోను ఎంజీబీఎస్ వద్దే ఆపారు. పాతబస్తీకి మెట్రో లైన్ ఎందుకు నిర్మించడం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలి' అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
'కుటుంబపాలన, అవినీతిపైనే మా పోరాటం'
మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం కొనసాగిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కుటుంబ పాలనను, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ రెండు విషయాల్లో ప్రధాని మోదీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు ఉంచారని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటల తర్వాత సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదని అన్నారు.
సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తమపై విష ప్రచారం జరుగుతోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గతంలో పొత్తులు పెట్టుకున్నది, ఒప్పందాలు చేసుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారం పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 'కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే. ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే. నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మేము ఎప్పుడూ కాంగ్రెస్ తో, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదు. తెలంగాణ సమాజానికి అండగా నిలబడటమే మా ధ్యేయం. ఒక కుటుంబమే పరిపాలన చేయడం తెలంగాణ మోడలా.. 9 ఏళ్లు సెక్రటేరియట్ కు రాకపోవడం తెలంగాణ మోడలా..' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.