All-Party Meeting: 



19వ తేదీన మీటింగ్..


ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. అంతకు ముందు రోజు..అంటే జులై 19వ తేదీన ఆల్‌ పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చింది. ఆగస్టు 10వ తేదీ వరకూ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల రోజుల్లో దాదాపు 20 సార్లు సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం ముందు వీటికి ముగింపు పలకనున్నారు. ఈ సారి సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ సెషన్‌లోనే యునిఫామ్ సివిల్ కోడ్‌ బిల్‌ ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌నీ పాస్ చేయాలని చూస్తోంది. ఆప్‌ తీవ్రంగా ఖండిస్తున్నా...బిల్‌ తీసుకు రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. వీటితో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్‌ (DPDP)ని ప్రవేశపెట్టనుంది. సమాచార భద్రత ప్రజల హక్కు అని తేల్చి చెబుతున్న కేంద్రం...వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచేందుకే ఈ బిల్ తీసుకురానున్నట్టు వివరిస్తోంది. ఇంటర్నెట్ కంపెనీస్, మొబైల్ యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే కేబినెట్ ఈ డ్రాఫ్ట్ బిల్‌కి ఆమోదం తెలిపింది. మాన్‌సూన్‌ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.