Monkeypox : ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఓ వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి  ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మంకీపాక్స్ లక్షణాలతో అతడు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అతనిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించిన వైద్యులు డీఎంహెచ్వోకి సమాచారం అందించారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో అతడిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. మంకీపాక్స్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఇంకా వ్యాధి నిర్థారణ కాలేదని వైద్యులు తెలిపారు. అతడి శాంపిల్స్ సేకరించి పూణె వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తామని వైద్యులు చెప్పారు. 


కామారెడ్డి వ్యక్తి నెగిటివ్


కువైట్ నుంచి కామారెడ్డికి వ‌చ్చిన యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధార‌ణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువ‌కుడి న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా నెగెటివ్ అని తేలింది. నిన్న ఫీవ‌ర్ ఆస్ప‌త్రిలో చేరిన యువ‌కుడి నుంచి ఐదు ర‌కాల న‌మూనాల‌ను సేక‌రించి.. పుణె ల్యాబ్‌కు పంపారు.  ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వ‌చ్చిన ఆ యువ‌కుడు తీవ్ర నీర‌సానికి గుర‌య్యాడు. జ్వ‌రంతో బాధ‌ప‌డ్డాడు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. శ‌రీరంపై ఉన్న ద‌ద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండ‌టంతో నోడ‌ల్ కేంద్రంగా ఉన్న‌ ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చాడ‌ు.  బాధిత యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


దేశంలో మంకీపాక్స్ కేసులు


దేశంలో మంకీపాక్స్ వైరస్ సోకిన కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం  చేసింది.  జూలై 22 నాటికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రరోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16,836 మందికి మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. ఇప్పుడు అంతర్జాతీయ వైద్యులంతా ఒక్కటై మంకీపాక్స్ విషయంలో క పరిశోధనలు చేస్తున్నారు.  


లైంగికంగా సంక్రమించే వ్యాధి


మంకీపాక్స్ కేవలం లైంగికంగా మాత్రమే సంక్రమించే వ్యాధి కాదని, అది ఎలాంటి దగ్గరి శారీరక సంబంధం ద్వారానైనా సంక్రమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని అభిప్రాయపడుతున్నారు.  ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుంచి వ‌చ్చిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు.