వానాకాలంలో స్పైసీగా తింటే చాలా బావుంటుంది. అందులోనూ నాన్ వెజ్ అయితే అదిరిపోతుంది. చికెన్ మసాలా ఫ్రైను ఇలా చేసుకుంటే రుచి మర్చిపోలేరు. అందులోనూ ఇది చేయడం చాలా సులువు. చికెన్ తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. విటమిన్ ఇ, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి12 వంటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వానాకాలంలో చికెన్ తినడం చాలా లాభాలు ఉన్నాయి. చికెన్ లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. సన్నగా ఉండే వారు చికెన్ తరచూ తింటే కాస్త కండ పట్టి చక్కటి శరీరసౌష్ఠవాన్ని పొందుతారు. పెరిగే పిల్లలకు చికెన్ తినిపించడం చాలా మంచిది. చికెన్లో అధికంగా అమినోయాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లలను పొడవుగా ఎదిగేలా చేస్తాయి.
కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
ఉల్లితరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
నూనె - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. చికెన్ ముక్కల్ని మరీ పెద్దవి కాకుండా, అలా మరీ చిన్నవి కాకుండా కట్ చేయించుకోవాలి. బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. కళాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకులు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
3. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగితే మంచి సువాసన వస్తుంది.
4. ఆ మిశ్రమంలో చికెన్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి.
5. చిన్న మంట పెట్టి కళాయిపై మూత పెట్టాలి.
6. కాసేపు ఉడికించాక నీళ్లు దిగి ఇంకిపోయే వరకు ఉంచాలి.
7. నీరు ఇంకిపోయాక ధనియాల పొడి, కారం, పసుపు, కరివేపాకులు వేసి వేయించాలి.
8. గరం మసాలా కూడా వేసి కలపాలి.
9. చిన్న మంట మీద వేయిస్తే చికెన్ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది.
10. దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే ఆ రుచే వేరు.
Also read: ఇలా స్నానం చేయడం వల్ల అకస్మాత్తుగా గుండె పోటు వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
Also read: ఈ పాపని చూస్తుంటే ఐన్‌స్టీన్ మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందా? నిజానికి ఈ పాపదో అరుదైన వ్యాధి