No Special Status For AP : ప్రత్యేక కేటగిరీ హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేస్తున్నామని..ఆ నిధులను ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాబట్టి ఇకహోదా లేనట్లేనని మరోసారి కేంద్రం పరోక్షంగా చెప్పినట్లయింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమల్లో ఉందని.. 17 ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల (EAPలు) కోసం రూ.7798 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందని కేంద్రమంత్రి సమాధానంలో పేర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వం ప్యాకేజీని అంగీకరించిందన్న కేంద్రం
ప్రత్యేక ప్యాకేజీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని మే 2, 2017న లేఖ ద్వారా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారని కేంద్ర మంత్రి వెల్లడించారు.ప్రత్యేక ప్యాకేజీలో 100% కేంద్రప్రభుత్వ నిధులతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి నిర్ణయాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో ఏపీలో వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాలకుతెరపడినట్లయిందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 17 ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లపై రుణం అసలు , వడ్డీ రెండూ తిరిగి చెల్లించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతన్నారు. అంతే కాదు ఈ 17 ప్రాజెక్టులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని జీవీఎల్ తెలిపారు.
ప్యాకేజీ కింద పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం
పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలను, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు , కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 15న ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల నిధులతో ప్రత్యేక ప్యాకేజీని ప్కటించిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో చేర్చిన ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ కు రూ. 1859 కోట్లు , ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్ట్ కు రూ. 935 కోట్లు , ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్‌కు రూ. 897 కోట్లు , ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్‌కు రూ. 825 కోట్లు ఇచ్చారని జీవీఎల్ తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలులో లేదని ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించాయన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంతో ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయని జీవీఎల్ మండిపడ్డారు.
ప్యాకేజీ అమల్లో ఉన్నందున హోదా ప్రశ్నే లేదని కేంద్రం చెప్పినట్లయింది !
కేంద్ర ప్రభుత్వం ఎపీకి ప్యాకేజిని అమలు చేస్తుందని చెప్పటం ద్వార హోదా అనే విషయం అసలు చర్చల్లో కానీ ఆలోచనల్లో కానీ లేదని మరోసారి స్పష్టమయింది. ఇటీవల ఎపీలో ప్రదాని మోడీ పర్యటన సందర్బంగా సీఎం జగన్ హోదా పై లిఖిత పూర్వకంగా విజ్ఞాపనను కూడ స్వయంగా అందించారు.అప్పటి వరకు హోదా పై అందరూ ఆశలు వదులుకున్నారు. స్వయంగా జగన్ హోదా కావాలంటూ లేఖ ఇవ్వటంతో మరలా అందరి దృష్టి కూడ హోదా పై పడింది .అయితే తాజాగా పార్లమెంట్ సాక్షిగా ప్యాకేజీ అమల్లో ఉందని చెప్పడం ద్వారా హోదా ఇక ఇచ్చేది లేదని చెప్పిటన్లయింది.