Hyderabad Metro: చెల్లించిన మొత్తానికి సేవలు పొందడం వినియోగదారుల హక్కు. సేవలు అందించడంలో సంస్థ విఫలమైతే కోర్టుకు వెళ్లొచ్చు. తాను పొందిన అసౌకర్యానికి పరిహారం పొందవచ్చు. ఇలాంటి ఘటననే  హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగింది. ప్రయాణికుడి నుంచి హైదరాబాద్ మెట్రో రూ.10 వసూలు చేసింది. దీనిపై బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. విచారణ జరిపిన కమిషన్ మెట్రో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుడికి సేవలు అందించడంలో విఫలం, పైగా ప్రయాణికుడి నుంచి రూ.10 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరగగా తాజాగా దీనిమీద తీర్పు వెలువరించింది కోర్టు.


నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్‌ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10 రూ. కట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. 2019 జనవరి 10వ తేదీన ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ హైదరాబాద్ కు వచ్చాడు. మెట్రో రైల్ ఎక్కడం కోసం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లోకి వెళ్లారు. తాను వెళ్లాల్సిన తూర్పు వైపు దారిలో టాయిలెట్స్ కనిపించలేదు. దీంతో మరోవైపు వెళ్ళాడు. దీంతో మెట్రో కార్డును మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. అక్కడ టాయిలెట్స్ వాడుకున్న తర్వాత.. తిరిగి మళ్లీ రావడం కోసం మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. దీంతో అతని మెట్రో కార్డు నుంచి హైదరాబాద్ మెట్రో రూ.10  కట్ చేసింది. 


అయితే.. అదే స్టేషన్‌లో ఓ పైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు రూ.10 ట్రావెల్ కార్డ్ నుంచి కట్ కావటంతో ఆయన సిబ్బందిని నిలదీశాడు. తాను ట్రావెల్ చేయకుండా డబ్బులు ఎలా కట్ అవుతుతాయని అడిగాడు. దానికి మెట్రో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. దీనిపై ఆయన ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. రెండువైపులా టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తన వద్ద రూ. 10 అదనంగా వసూలు చేశారని, మెట్రో సంస్థ నిర్లక్ష్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. 


ఈ ఫిర్యాదుపై మంగళవారం ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ లలిత, సభ్యురాలు మాధవీలత విచారణ చేపట్టారు. ప్రయాణికునికి జరిగిన అసౌకర్యానికి రూ.5 వేలు, కోర్టు ఖర్చులు మరో రూ.5 వేలు 45 రోజుల్లో చెల్లించాలని మెట్రో సంస్థను ఆదేశించింది. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులు పెట్టాలని ఖమ్మం వినియోగదారుల కమిషన్‌ హైదరాబాద్‌ మెట్రోకు సూచించింది. 


హైదరాబాద్ మెట్రోకు ఇది కొత్తేం కాదు
ఇలాంటి విషయాలు హైదరాబాద్ మెట్రోలో కొత్తేం కాదు. మెట్రో స్టేషన్లలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంటోంది. అంతేకాదు మరుగుదొడ్ల దుస్థితి గురించి అయితే చెప్పనలివికాదు. వాటిని శుభ్రం చేసినా దాఖలాలు ఉండవు. వాటిని ఉపయోగించుకోవాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. గతంలో మెట్రో స్టేషన్లలోని మరుగుదొడ్లను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్తగా వాటికి సైతం చార్జీలు వసూలు చేస్తున్నారు.  ప్రయాణికులపై భారాన్ని మోపుతూ హైదరాబాద్‌ మెట్రో రుసుమును విధించింది. మూత్రవిసర్జనకు రూ.2, మరుగుదొడ్ల వినియోగానికి రూ.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు టాయిలెట్ల నిర్వహణ బాధ్యతతను సులభ్‌ కాంప్లెక్స్‌కు అప్పగించారు.