Raksha Bhandhan 2022 : రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఓ ఆత్మీయ పండుగ. ఈ రాఖీ పూర్ణిమ పండగ తన అక్కకు జీవితాంతం గుర్తు ఉండాలని భావించాడో తమ్ముడు. అనుకున్నదే తడువుగా తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుతో రాఖీ పండుగ సందర్భంగా అక్కకు తులాభారం నిర్వహించాడు.
అక్కకు తులభారం
ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వారు రణశ్రీ, త్రివేది. రణశ్రీకి గత సంవత్సరం వివాహం చేశారు తల్లిదండ్రులు. వివాహమైన తర్వాత మొదటిసారిగా వస్తున్న రాఖీ పూర్ణిమ పండుగను తన అక్కకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేయాలనుకున్నాడు తమ్ముడు త్రివేది. అక్కపై ఉన్న ప్రేమతో తాను చిన్నతనం నుంచి దాచుకున్న డబ్బును అయిదు రూపాయల కాయిన్లుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు. తులాభారంలో సుమారు 11,200 ఐదు రూపాయల కాయిన్స్ తూగాయి. వాటి విలువ సుమారు 56 వేల రూపాయలను కానుకగా ఇచ్చాడు.
ఘనంగా వేడుక
ఈ తులాభారం వేడుకకు బంధువులు, స్నేహితులను పిలిచి ఘనంగా నిర్వహించారు. తన అక్కకు ఇలా తులభారం నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు త్రివేది. తన తమ్ముడు చేసిన ఈ తులాభారం పట్ల అక్క రణశ్రీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని సంతోషం వ్యక్తం చేసింది. తన కొడుకు అక్క పై ఇంత అభిమానాన్ని చూపడం పట్ల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇలా ఎక్కడా చూడలేదు
'నా తమ్ముడు చూపిన ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నాను. నా కోసం తమ్ముడు ఇలా డబ్బులు దాస్తున్నాడని తెలియదు. ఇలా తులాభారం నిర్వహించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్. ఇలానే అందరూ ప్రేమాభిమానాలతో మెలగాలని కోరుకుంటున్నాను. ఇలా తులభారం ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. తీసుకోవడం కూడా నేనే ఫస్ట్ అనుకుంటున్నాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది'. - రణ శ్రీ
సీఎం కేసీఆర్ రాఖీలు కట్టిన సోదరీమణులు
ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆయన సోదరీమణులు వచ్చారు. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసిఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ సోదరిని నిండు మనసుతో ఆశీర్వదించారు.
సీఎం కేసీఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. తమ మనుమడు మనుమరాలును నిండు నూరేళ్లు జీవించాలని సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Also Read : Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి రోజున బిడ్డ పుడితేనే రక్షాబంధన్ పండుగ- నేటికీ వేడుక చేసుకోని గ్రామం
Also Read : Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!