వెబ్ సిరీస్ రివ్యూ: హలో వరల్డ్
రేటింగ్: 2.75/5
నటీనటులు: ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి, నిఖిల్ విజయేంద్ర సింహా, అపూర్వ, అనిల్ జీలా, స్నేహాల్ ఎస్ కామత్, రవి వర్మ, జయప్రకాశ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు
సంగీతం: పీకే దండి
నిర్మాత: నిహారికా కొణిదెల
దర్శకత్వం: శివ సాయివర్ధన్ జలదంకి
విడుదల తేదీ: ఆగస్టు 12, 2022
హలో వరల్డ్ (Hello World Web Series)... 'జీ 5'లో విడుదలైన లేటెస్ట్ ఒరిజినల్ సిరీస్. దీని స్పెషాలిటీ ఏంటంటే... హీరో ఆర్యన్ రాజేష్, హీరోయిన్ సదాకు ఇదే తొలి వెబ్ సిరీస్. ఇందులో యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్, నిఖిల్ విజయేంద్ర సింహ, 'మై విలేజ్ షో' అనిల్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ఎలా ఉంది? (Hello World Review)
కథ (Hello World Web Series Story) : పీపుల్ టెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. అందులో ఉద్యోగం కోసం పెళ్లి వద్దనుకుని వచ్చిన అమ్మాయి మేఘన (నయన్ కరిష్మా), బీటెక్ కంప్లీట్ చేయడానికి ఆరేళ్ళు తీసుకున్న యవకుడు వరుణ్ (సుదర్శన్ గోవింద్), పల్లెటూరి నుంచి వచ్చిన కుర్రాడు సురేష్ (అనిల్), మూగ అమ్మాయి అమృత (స్నేహాల్ ఎస్ కామత్), మంచి కుర్రాడు సిద్దార్థ్ (రామ్ నితిన్), బీటెక్ నుంచి క్లాస్‌మేట్స్ అయినటువంటి రాహుల్ (నిఖిల్ విజయేంద్ర సింహా), వర్ష (అపూర్వ రావు)... ఉన్నారు. వాళ్ళకు మెంటార్స్‌గా రాఘవ్ (ఆర్యన్ రాజేష్), ప్రార్ధన (సదా) ఉంటారు.
రాఘవ్ టేకప్ చేసిన కొత్త ప్రాజెక్టులోకి ఫ్రెషర్స్‌ను తీసుకుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారీ రాఘవ్‌ది తప్పు అని అందరి ముందు పరువు తీయడానికి డేబాషిష్ సేనాపతి (రవి వర్మ) ప్రయత్నిస్తుంటాడు. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఫ్రెషర్స్ ఎలా కలిశారు? ప్రాజెక్టులో వాళ్ళకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? రాఘవ్, డేబాషిష్ మధ్య గొడవ ఏమిటి? ప్రార్థన నేపథ్యం ఏమిటి? చివరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిందా? లేదా? అనేది మిగతా వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ (Hello World Telugu Web Series Review) : బీటెక్ నేపథ్యంలో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు... 'హ్యాపీ డేస్'. బీటెక్ తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించిన తర్వాత ఆఫీసుల్లో ప్రేమలో పడిన అమ్మాయి, అబ్బాయి కథలతో సినిమాలు వచ్చాయి. అయితే... బీటెక్ తర్వాత కూడా కాలేజీ జీవితంలో ఉన్నట్లు ఉండాల్సి వస్తే? ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనే సందేహంలో జాబ్ చేయాల్సి వస్తే? అక్కడ కొంతమంది యువతీయువకుల మధ్య చిగురించిన స్నేహం, ప్రేమ అంశాల కలబోతే 'హలో వరల్డ్'.
భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన యువతీయువకుల మధ్య చిగురించడం వంటివి కాలేజీ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో చూసినప్పటికీ... 'హలో వరల్డ్'లో ఆఫీస్ నేపథ్యం కావడం కొంచెం కొత్తదనం తీసుకొచ్చింది. మూడు నాలుగు ఎపిసోడ్స్ వరకూ క్యారెక్టర్లు, బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు టైమ్ తీసుకున్నారు.
దర్శకుడు శివ సాయివర్ధన్ సున్నితమైన అంశాలను చక్కగా చూపించారు. తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న ఓ అమ్మాయి పెళ్ళికి కొన్ని గంటల ముందు జాబ్ ఆఫర్ రావడంతో పెళ్లి వద్దనుకుని వచ్చేసే సీన్స్ బాగా తీశారు. అమ్మాయి వచ్చిన తర్వాత ఆమె అన్నయ్యను కుటుంబ సభ్యులు చుట్టుముట్టే సీన్ నవ్వించింది. లగ్జరీ లైఫ్ కోసం ఇంట్లో చూసిన అబ్బాయికి ఓకే చెప్పేసి, తన వెంట పడుతున్న అబ్బాయికి హ్యాండ్ ఇచ్చే మరో అమ్మాయి సన్నివేశాలను చక్కగా మలిచారు. ఆ యువకుడి పెయిన్ క్యాప్చర్ చేసిన తీరు మనసును తాకుతుంది. ప్రేమ పేరుతో మోసపోయి... చిన్నారితో ఒంటరి జీవితం వెళ్లదీసే మహిళ జీవితాన్ని చూపించిన విధానం హృద్యంగా ఉంది.
'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌లోనూ పంటి కింద రాయిలా తగిలే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ రాకపోవడంతో పల్లెటూరి యువకుడు పడే కష్టాలు నవ్వించలేదు. రాఘవ్ మీద డేబాషిష్ సేనాపతికి ఎందుకంత కోపం అనేది రివీల్ అయ్యాక అంత ప్రభావం ఉండదు. మోడ్రన్ అమ్మాయిలు మందు, సిగరెట్ కొడతారని టైప్ కాస్ట్ చేయడం రొటీన్ అనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో రాజకీయాలు చూపించడంలో సక్సెస్ అయ్యారు. 'హలో వరల్డ్'లో స్పెషాలిటీ ఏంటంటే... సింపుల్ అండ్ స్ట్రయిట్‌గా చాలా విషయాలు చెప్పారు. అయితే... లోతుగా చెప్పాల్సిన కొన్ని సన్నివేశాలను పైపైన చెప్పినట్లు ఉంటుంది. రాఘవ్ ఫ్యామిలీ సీన్స్, హాస్పిటల్ సీన్స్ వగైరా వగైరా.
నటీనటులు ఎలా చేశారు? : ఆర్యన్ రాజేష్‌ను చూస్తే ఒక్కప్పుడు హీరోగా చేసింది ఇతనేనా? అనిపిస్తుంది. క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా సింపుల్‌గా నటించారు. సదా కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. నటనలో వాళ్ళిద్దరూ చూపించిన పరిణితి బావుంది. రామ్ నితిన్, నిఖిల్ విజయేంద్ర సింహ, సుదర్శన్ గోవింద్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. నయన్ కరిష్మా ముఖంలో క్యారెక్టర్‌కు అవసరమైన టెన్షన్ కనిపించింది. సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి మధ్య ట్రాక్ క్యూట్‌గా, లవ్లీగా ఉంది. రవి వర్మ, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. మూగ అమ్మాయి అమృత పాత్రలో స్నేహాల్ ఎస్ కామత్ హావభావాలు బావున్నాయి.
Also Read : మాచర్ల నియోజకవర్గం రివ్యూ : నితిన్ సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నిఖిల్ వి సింహా - ప్రధాన పాత్రధారుల అభినయం ఆకట్టుకుంటుంది. 'హలో వరల్డ్' సింపుల్ అండ్ హానెస్ట్ వెబ్ సిరీస్. సాఫ్ట్‌వేర్ రంగంలో పరిస్థితులను, రాజకీయాలను సున్నితంగా ఆవిష్కరించారు. ఎమోషన్స్‌ను మరింత స్ట్రాంగ్‌గా చూపించి ఉంటే బావుండేది. కొంత నిదానంగా సాగినప్పటికీ... వీకెండ్ ఖాళీ సమయం దొరికితే చూసే ప్రయత్నం చేయవచ్చు.
Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?