Amit Shah Call to Sai Ganesh Family: ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ వ్యవహారం ఢిల్లీ పెద్దల వరకూ వెళ్లింది. చనిపోయిన సాయి గణేష్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఈ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని అమిత్ షా పరామర్శించినట్లుగా తెలిసింది. నేడు సాయి గణేష్ కుటుంబ సభ్యులను బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించిన సమయంలోనే అమిత్ షా మాట్లాడినట్లు తెలుస్తోంది. 


ఏప్రిల్ 14వ తేదీన ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న సాయి గణేష్ మరణించాడు. పోలీసుల సమక్షంలో స్టేషన్‌లో పురుగు మందు తాగడంతో వెంటనే పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో బీజేపీ నేతలు హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడే చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు.


ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు
ఈ ఆత్మహత్య తర్వాత ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఖమ్మంలో మంత్రి ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేయని విషయంపై కూడా బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి బీజేపీ నేతలు ఈ విషయం తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అమిత్ షా సాయి గణేష్ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు.


రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే.. టీఆర్‌ఎస్‌
మతాల మద్య చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే సాయిగణేష్‌ ఆత్మహత్యకు పురిగొల్పిందని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సాయి గణేష్‌ మృతికి సంబందించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని, అవసరమైతే సీబీఐ విచారణ చేయించాలని కోరుతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు సాయి గణేష్‌ ఆత్మహత్య విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని పుట్టించిన సాయి గణేష్‌ మృతిపై బీజేపీ లీగల్‌ సెల్‌ ఎలాంటి విషయాలను వెలికితీయనుందనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.