Khairatabad Ganesh : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ను మట్టితో రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి మహా గణపతి విగ్రహాన్ని మట్టితోని రూపొందిస్తామన్నారు. ఈ ఏడాది 50 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్, కన్వీనర్‌ సందీప్‌ రాజ్ ఇతర సభ్యులు శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్‌ మండపం వద్ద కర్ర పూజ నిర్వహించారు. మట్టి మహాగణపతి నిమజ్జనాన్ని ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ వెల్లడించారు. 


వేధింపులు సరికాదు


గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంత్‌ రావు కోరారు. విగ్రహాలు భారీ ఎత్తున తయారు చెయ్యొద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు గణేశ్‌ విగ్రహాల తయారీదారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏడాది పొడవునా కేవలం విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్న వారిపై వేధింపులు సరికాదని విజ్ఞప్తి చేశారు.


ప్రభుత్వం సహకరించట్లేదు


సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడిని మాలి, కార్యదర్శులు మాట్లాడుతూ  పదేళ్లుగా గణేశ్‌ ఉత్సవాలపై వివాదం సృష్టిస్తున్నారన్నారు. హిందూ పండుగలను అణచివేస్తే సహించబోమన్నారు. ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనం చేయనీయడం లేదని ఆరోపించారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేశామన్నారు. అయినా ప్రభుత్వం కోర్టుకు హాజరుకావడం లేదన్నారు.  ఈ నెల 24న మరోసారి కోర్టులో విచారణ ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు.