Vijayawada Crime : బెజవాడ లో రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడి, అమాయకుల నుంచి బంగారం, నగదుతో పాటుగా విలువైన ఆభరణాలను దోచుకోవటం ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహరంపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందటంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు రౌడీషీటర్ల కదలికల పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా విజయవాడ సౌత్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఆగడాలపై పోలీసులకు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్ ఐదో తేదీన బీసెంట్ రోడ్ లో ఒక వృద్ధుడు మెడలో నుంచి బంగారం గోలుసు చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తు రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. వీరిపై రౌడీషీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఆభరణాలు చోరీ
గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ రవి కిరణ్ మాట్లాడుతూ.. ఈనెల ఐదో తేదీ రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో కోసం వేచి ఉన్న ఒక వృద్ధుడి మెడలో నుంచి బంగారం చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులు జాన్ పాల్ రత్నకుమార్, నాగ గౌతంగా గుర్తించారు. వీరు నైజాం గేట్ వద్ద చోరీ చేసిన ఆభరణాలను అమ్ముతున్న సమయంలో పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. రూ.16 వేల నగదుతో పాటు బంగారు లాకెట్ ను రికవరీ చేసి వారిని అదుపులోకి తీసుకోని కోర్టుకు హాజరు పరిచామని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే బెజవాడ బీసెంట్ రోడ్డులో ఈ తరహా సంఘటన వెలుగులోకి రావటం కలకలం రేపింది. దీంతో పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తును కీలకంగా తీసుకున్నారు. నిందితులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకుండా జాగ్రత్త పడ్డారు.
నిందితులు జాగ్రత్త పడినా చిక్కారు!
నిందితులు పోలీసులకు క్లూ దొరక్కుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా చోరీలకు పాల్పడాలని ప్లాన్ వేసినప్పటికీ, చివరకు చట్టానికి చిక్కకుండా ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కీలకంగా మారాయి. సంఘటనన జరిగిన ప్రదేశంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించగలిగారు. సీసీ కెమెరాల నిఘాను తప్పించుకున్న, నిందితులు సెల్ ఫోన్ సిగ్నల్స్ కు సంబంధించిన ఆధారాలను దాటి వెళ్లలేకపోయారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన కానిస్టేబుల్ కు నగదు రివార్డును అందించారు. ఈ కేసు దర్యాప్తు లో సీఐ సురేష్ బాబుతో పాటు ఎస్సైలు పాల్గొన్నారని వివరించారు.