Key Update On Telangana Loan Waiver Guidelines: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే తెలంగాణలో రైతులకు రుణ మాఫీ (Farmer Loan Waiver) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కేబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.2 లక్షల రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2023, డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింపచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా రైతుల సమక్షంలోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నాలుగు రోజుల్లో రుణమాఫీ విధి విధానాలు విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గైడ్ లైన్స్‌పై ఫోకస్
అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఆర్థిక శాఖ అధికారులు గైడ్ లైన్స్ రూపకల్పనపై కుస్తీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పలువురు అధికారులు పర్యటించి గైడ్ లైన్స్‌పై అధ్యయనం చేశారు. కేంద్రం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకం రూల్స్ రుణమాఫీకి వర్తింపచేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు, ఐటీ చెల్లించే వారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.
నిధుల సమీకరణపై ఫోకస్
రుణ మాఫీ మార్గదర్శకాల విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో పథకం అమలుకు సంబంధించి నిధుల సమీకరణపైనా ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఇతర మార్గాలను కూడా చూస్తున్నట్లు సమాచారం.
'వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభం'
అటు, వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రుణమాఫీతో ప్రభుత్వంపై రూ.31 వేల కోట్ల భారం పడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నారని ప్రశంసించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Also Read: IPS Transfers: తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ, సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు