Key Maoists from Telangana to surrender: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ తగిలే సూచనలు కనిపిసతున్నాయి. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) – సిపిఐ(మా) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న , డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్‌తో పాటు వారి క్యాడర్ 20 మంది లొంగిపోతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సరెండర్ వచ్చే వారం రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ పోలీసులు 'ఆపరేషన్ చెయుత' పేరుతో లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లా మొద్దుల గూడెం గ్రామానికి చెందిన వారు. 1995 నుంచి ఆజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు (బీకేజీ-ఏఎస్‌ఆర్) డివిజన్ కమిటీ మాజీ కార్యదర్శి. రాష్ట్ర కమిటీ సెక్రటరీ హరిభుషణ్ మరణం తర్వాత లీడర్‌షిప్ పోటీలోఉన్నారు. కానీ బాదే చొక్క రావు అలియాస్ దామోదర్ సెక్రటరీగా ఎదిగారు. అతని తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది.
అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎఫ్‌సిఐ ప్రాంతం స్వస్థలం. 1999 నుంచి ఆజ్ఞాతతంలోఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీమ్ హెడ్, జమ్మూ కాశ్మీర్-వెస్ట్ పాకిస్తాన్ (జెఎన్‌డబ్ల్యూపీ) రీస్ట్రక్చరింగ్ బ్లాక్ మాజీ డివిజన్ కమిటీ సభ్యుడు. కరీంనగర్ కమిటీ మెంబర్‌గా ప్రారంభించి, డివిజన్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు.ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉంది. ఈ ఇద్దరూ మధ్యవర్తుల ద్వారా తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. వారితో పాటు డివిజన్, ఏరియా కమిటీల సభ్యులు 20 మంది సరెండర్ అవుతారని అంటున్నారు. మరో సీనియర్ రాష్ట్ర కమిటీ నేత కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో మిగిలిన 64 మంది మావోయిస్టులు కూడా మెయిన్‌స్ట్రీమ్‌లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కంకణాల రాజిరెడ్డి కూడా లొంగుబాటు దిశగా చర్చలు
ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక నేత కంకణాల రాజిరెడ్డి సైతం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొద్ది నెలలుగా పెద్దపల్లి పోలీసులు ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించి, సరెండర్‌కు ప్రోత్సహిస్తున్నారు. రాజిరెడ్డి పార్టీలో కేంద్ర కమిటీ మెంబర్‌గా గుర్తింపు పొందాడు, రూ. 1 కోటి ఆయన తలకు వెల కట్టారు. సరెండ్ అయితే ప్రజాజీవితంలోకి వస్తానని తనకు పదవి ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోంది. 2025లో ఇప్పటికే 427 మంది లొంగిపోయారు, వీరిలో సీనియర్ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలోకి రావాలని పిలుపు ఇచ్చారు. పోలీసులు ఈ సరెండర్‌లకు సంబంధించి రిహాబిలిటేషన్ ప్యాకేజీలు అందించనున్నారు.