Ultra-Fast EV Charging: ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు కేవలం వాహనాలు మాత్రమే కాదు, ఒక సాంకేతిక విప్లవంగా మారాయి. త్వరలో రాబోయే ఈ కొత్త తరంలో ఛార్జింగ్ సమయం కేవలం ఒక కప్పు టీ తాగే సమయానికి తగ్గిపోనుంది. బ్యాటరీలు 1000 కి.మీ వరకు రేంజ్‌ను అందించనున్నాయి. పవర్ గ్రిడ్స్ కూడా మరింత స్మార్ట్‌గా మారనున్నాయి. ఈ రాబోయే సాంకేతికత భారతీయ ఎలక్ట్రిక్ భవిష్యత్తును పూర్తిగా మార్చనున్నాయి.  

Continues below advertisement

గేమ్ ఛేంజర్ – సాలిడ్ స్టేట్ బ్యాటరీలు

ప్రస్తుతం EVలలో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలు మంచివే అయినప్పటికీ, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫైర్ రిస్క్ ఎక్కువగా ఉండటం, ఛార్జింగ్ నెమ్మదిగా ఉండటం, లైఫ్ సైకిల్స్ పరిమితంగా ఉండటం ఇందులో ఉన్న లోపాలు. అయితే, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు ఈ పరిమితులకు పరిష్కారాన్ని చూపనున్నాయి.

సాలిడ్ స్టేట్ బ్యాటరీల ప్రత్యేకతలు చూస్తే లిథియం అయాన్ బ్యాటరీలలో ద్రవ ఎలక్ట్రోలైట్ ఉపయోగిస్తున్నారు. కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీలలో ఘన పదార్థాలు ఉపయోగిస్తారు. దీని ఫలితంగా:

Continues below advertisement

  • ఫైర్ రిస్క్ దాదాపు సున్నా: అగ్ని ప్రమాదం వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండవు.
  • 2X ఫాస్ట్ ఛార్జింగ్: ఛార్జింగ్ సమయం సగానికి తగ్గుతుంది.
  • 50% అధిక ఎనర్జీ డెన్సిటీ: ఇది అత్యంత కీలకమైన అంశం. లిథియం అయాన్ బ్యాటరీలు 500 నుంచి 600 కి.మీ రేంజ్ ఇస్తే, అదే పరిమాణంలో ఉండే సాలిడ్ స్టేట్ బ్యాటరీలు 1000 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలవు.
  • 2-3X లైఫ్ సైకిల్: బ్యాటరీ జీవితకాలం రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా, టయోటా (Toyota), సీఏటీఎల్ (CATL) వంటి దిగ్గజాలు 2026 చివరి నాటికి సాలిడ్ స్టేట్ టెక్నాలజీని మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నాయి. భారతదేశంలో ఇస్రో (ISRO),  ఐఐటీ మద్రాస్ (IIT Madras) వంటి పరిశోధనా సంస్థలు ఇప్పటికే దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. లాగ్‌9 మెటీరియల్, ఓలా ఎలక్ట్రిక్ వంటి భారతీయ స్టార్టప్‌లు కూడా ఈ దిశగా పరిశోధన, అభివృద్ధి పనులు ముమ్మరం చేశాయి.

అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ – కేవలం 10 నిమిషాల్లో టాప్-అప్!

EV వినియోగదారులకు ఛార్జింగ్ సమయం అనేది ఇప్పటికీ అతి పెద్ద ఆందోళనగా ఉంది. అయితే, అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపనుంది.

సీఏటీఎల్ (CATL) సంస్థ తమ షెన్జింగ్ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ'ని విడుదల చేసింది. ఇది కేవలం 10 నిమిషాల్లో 700 నుంచ 800 కి.మీ వరకు ప్రయాణించే రేంజ్‌ను అందించగలదు. టెస్లా (Tesla), నియో (Nio) హ్యుందాయ్ (Hyundai) వంటి కంపెనీలు కూడా 350 కిలోవాట్ ప్లస్ (350 kW+) ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.

భారతదేశంలో ట్రెండ్: మన దేశంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టాటా పవర్, స్టాటిక్ వంటి సంస్థలు 240 kW నుంచి 350 kW వరకు డీసీ (DC) ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, రాబోయే రెండేళ్లలో ఛార్జింగ్ సమయం పెట్రోల్ నింపే సమయానికి చేరువ అవుతుంది.

టైమ్ చార్ట్ విశ్లేషణ:

  • 7 kW ఏసీ ఛార్జర్: 0 నుంచి 80% ఛార్జ్ కావడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది.
  • 50 kW డీసీ ఛార్జర్: 60 నుంచి 90 నిమిషాలు పడుతుంది.
  • 350 kW డీసీ ఛార్జర్: ఛార్జింగ్ సమయం 15 నిమిషాల కన్నా తక్కువకు తగ్గిపోతుంది.

భవిష్యత్తులో ఛార్జింగ్ అనేది కేవలం కాఫీ లేదా టీ తాగే సమయంలో పూర్తి కానుంది.

బ్యాటరీ స్వాపింగ్- మాడ్యులర్ ప్యాక్‌లు

బ్యాటరీ స్వాపింగ్ అనేది భారతదేశానికి మరో 'గేమ్ ఛేంజర్' ఇన్నోవేషన్. ఈ విధానంలో అయిపోయిన బ్యాటరీని తీసివేసి, కేవలం రెండు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీని అమర్చుకోవచ్చు.

తైవాన్‌కు చెందిన గొగొరో ఇప్పటికే ఈ విధానంలో రోజుకు 12 లక్షల కంటే ఎక్కువ బ్యాటరీ స్వాప్‌లను నిర్వహిస్తోంది.

భారతదేశంలో ప్రణాళికలు:

• సన్ మొబిలిటీ, బౌన్స్ ఇన్ఫినిటీ వంటి సంస్థలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులపై పని చేస్తున్నాయి.

• భారత ప్రభుత్వం కూడా 2025 చివరి నాటికి బ్యాటరీ స్వాపింగ్ పాలసీని అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విధానం ముఖ్యంగా టూ-వీలర్స్, త్రీ-వీలర్స్‌కు ఎక్కువ ప్రయోజనకరం, ఎందుకంటే ఈ విభాగంలోనే రేంజ్ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఓలా (Ola), టీవీఎస్ (TVS), ఏథర్ (Ather) వంటి కంపెనీల స్కూటర్లు స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తే, సౌలభ్యం నెక్స్ట్ లెవెల్‌కు చేరుతుంది.

వెహికల్ టు గ్రిడ్ – కారు ఇక పవర్ బ్యాంక్

రాబోయే ఐదేళ్లలో, మీ EV కేవలం కరెంటు తీసుకోవడమే కాదు, తిరిగి గ్రిడ్‌కు కరెంటును ఇవ్వగలదు కూడా. దీనినే వెహికల్ టు గ్రిడ్ (V2G) టెక్నాలజీ అంటారు.

V2G టెక్నాలజీ ద్వారా పవర్ గ్రిడ్‌పై డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడు, మీ EV పవర్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపగలదు. దీని ద్వారా మీరు డబ్బు కూడా సంపాదించవచ్చు.

నిస్సాన్ (Nissan), బీవైడీ (BYD) వంటి గ్లోబల్ ఓఈఎంలు (OEMs) ఇప్పటికే V2G సామర్థ్యం ఉన్న వాహనాలను పరీక్షిస్తున్నాయి. 

భారతదేశంలో టాటా, ఎంజీ వంటి కంపెనీలు కూడా దీనిపై పైలట్ ప్రాజెక్టులు పరిశీలిస్తున్నాయి.

V2G ప్రయోజనం: భవిష్యత్తులో మీ కారు ఒక 'నడుస్తున్న పవర్ బ్యాంక్' అవుతుంది. మీరు మీ కారును సోలార్ ద్వారా ఛార్జ్ చేసి, ఆ అదనపు శక్తిని గ్రిడ్‌కు తిరిగి ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

సోడియం అయాన్ బ్యాటరీలు & దేశీయ తయారీ

మెటీరియల్స్ స్థాయిలో జరుగుతున్న ఈ 'సైలెంట్ రివల్యూషన్' భారతదేశానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

సోడియం అయాన్ బ్యాటరీలు: సోడియం అయాన్ బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీల కంటే చౌకగా ఉంటాయి. భారతదేశంలో సోడియం పుష్కలంగా లభిస్తుంది కాబట్టి, ఈ టెక్నాలజీ మన దేశానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సీఏటీఎల్, రిలయన్స్ వంటి సంస్థలు రెండూ సోడియం అయాన్ టెక్నాలజీపై పని చేస్తున్నాయి.

రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్ : EV మోటార్లలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ చాలా కీలకం. వీటి ధర ఎక్కువ, సరఫరా కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే, ఓలా సంస్థ ఇటీవల తాము రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉండనుంది. దీనికి ప్రభుత్వ ఆమోదాలు కూడా వచ్చాయి. ఈ రెండు ఇన్నోవేషన్లు భారతదేశాన్ని దిగుమతిపై ఆధారపడకుండా స్వేచ్ఛగా ఉంచడంలో సహాయపడతాయి. ఇదే నిజమైన 'EV ఇండిపెండెన్స్'.

అటానమస్ -కనెక్టెడ్ EVలు

EVలు కేవలం పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కనెక్టివిటీ గోల్‌గా మారనున్నాయి.

  • ఓటీఏ (OTA) అప్‌డేట్స్: ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్‌తో సాఫ్ట్‌వేర్ మెరుగుదల.
  • ప్రిడిక్టివ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్: బ్యాటరీ నిర్వహణ గురించి ముందే అంచనా వేయడం.
  • స్మార్ట్ నేవిగేషన్: రియల్ టైమ్ ఛార్జింగ్ డేటాను ఉపయోగించి నావిగేషన్.
  • వాయిస్ అసిస్టెడ్ కంట్రోల్స్: వాయిస్ ద్వారా వాహనాన్ని నియంత్రించడం.

టాటా, మహీంద్రా, బీవైడీ (BYD) వంటి కంపెనీలు ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేషన్‌పై పని చేస్తున్నాయి.

EV టెక్నాలజీ అనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉందనుకుంటే అది పొరపాటే. సాలిడ్ స్టేట్ బ్యాటరీల నుంచి రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్ల వరకు, ఈ 'నెక్స్ట్-జెన్' ఇన్నోవేషన్లు భారతీయ EV విప్లవాన్ని మరింత వేగవంతం చేయనున్నాయి. భవిష్యత్తులో, మీరు మీ EVని కేవలం 10 నిమిషాల్లో ఛార్జ్ చేయడమే కాక, దానితో మీ ఇంటికి విద్యుత్తును కూడా అందించినప్పుడు, EVలు భారతదేశాన్ని నిజంగా మార్చేశాయని అర్థం అవుతుంది.