KCR will take oath as MLA on Thursday :   తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అసెంబ్లీకి వెళ్తారు. 12 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు.  తర్వాత అసెంబ్లీలోని  లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం చేరుకుని  అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.  బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా   బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో  ఫామ్ హౌస్‌లో కాలు జారి పడిపోవడంతో కేసీఆర్ గాయపడ్డారు.  వైద్యులు తుంటి ఆపరేషన్ చేశారు. దీంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే, తొలి విడత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో అసెంబ్లీకి రానున్నారు.  


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  కేసీఆర్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారా లేదా అన్న అంశంపై బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరిగింది. ఆయన మెదక్ ఎంపీ సీటుకు పోటీ చేస్తారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా ఉంటే ప్రతిపక్ష నేతగా ఉండటానికి కేసీఆర్ ఇష్టపడరని అనుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రకటిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తారని కాంగ్రెస్ సంగతి తేలుస్తారని అంటున్నారు.                


ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం అత్యంత కీలకమని ..అందుకే కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ పెద్దలు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే కేసీఆర్ నేరుగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని కడిగి పారేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లో ఎన్నో చూసిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదని..కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం తలకిందులు అవుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తెలంగాణ సర్కార్ ఈ నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు రెడీ అవుతున్నారు.                                       


అసెంబ్లీలో మాత్రమే కాకుండా పార్టీని గాడిన  పెట్టేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల కు పార్టీని సమాయత్తం చేసేందుకు జిల్లాల పర్యటనలుక కేసీఆర్ రెడీ అవుతున్నారని కేటీఆర్ ఇంతకు ముందే ప్రకటించారు.  ఫిబ్రవరిలో పులి బయటకు వస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే.. ఫిబ్రవరి ఒకటో తేదీనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లనున్నారు. తర్వాత కేటీఆర్ చెప్పినట్లుగా రాజకీయం మారుతుందా లేదా అన్నది వేచి  చూడాల్సి ఉంది.