Bharat Jodo Nyay Yatra in Bengal: పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఆయన కార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కార్ వెనక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. బిహార్‌ నుంచి బెంగాల్‌లో యాత్ర ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.





అయితే....ఈ ఘటనపై జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రకి వస్తున్న స్పందన చూసి కొందరు అక్కసుతో ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండి పడ్డారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే..ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. రాహుల్‌ కార్‌పై కొందరు కార్యకర్తలు ఎక్కి కూర్చున్నారని..ఆ బరువు వల్ల అద్దం పగిలిపోయిందని అంటున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా రాళ్ల దాడి జరిగిందని తేల్చి చెబుతోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. 


"బెంగాల్‌లో న్యాయ్ యాత్ర జరుగుతుండగా రాహుల్ గాంధీ కార్‌పై వెనక నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వెనక అద్దం ధ్వంసమైంది. పోలీసులు అసలు ఏమీ పట్టనట్టే ఉంటున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఏమైనా జరగొచ్చు. ఇది చాలా చిన్న ఘటనే కావచ్చు. కానీ కాస్త అటు ఇటు అయితే పెద్ద ప్రమాదమే జరిగేది.రాహుల్ గాంధీ ఇలాంటి వాటి భయపడే వ్యక్తి కాదు. ఇంత కన్నా ఘోరమైన భద్రతా వైఫల్యం ఇంకెక్కడా ఉండదు. అసలు న్యాయ్ యాత్రకు భద్రతే కల్పించడం లేదు"


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ 






ఇటీవలే బిహార్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగిసింది. ఆ సమయంలోనే నితీశ్ కుమార్‌ ఉన్నట్టుండి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. NDAతో చేతులు కలిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ యాత్ర జరుగుతుండగానే బిహార్ రాజకీయాలన్నీ మారిపోయాయి. అక్కడా యాత్రకు ఇబ్బందులు ఎదురయ్యాయి.


Also Read: ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్‌కి అంతా సిద్ధం! తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన సతీమణి?