Parliament Budget Session 2024: బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడారు. పద్దు ఎలా ఉండబోతోందో వెల్లడించారు. భారత్‌ రోజురోజుకీ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని, ఈ మధ్యంతర బడ్జెట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టే సంప్రదాయాన్నీ తాము అనుసరిస్తామని వివరించారు. 


"కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. మేమూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. దేశానికి కొత్త దిశానిర్దేశం చేసే విధంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్దుని తయారు చేశారు. రోజురోజుకీ భారత్‌ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని బలంగా విశ్వసిస్తున్నాను. సమ్మిళిత అభివృద్ధి కనిపిస్తోంది. ప్రజల ఆశీర్వాదాలతో ఇది కచ్చితంగా కొనసాగుతుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ 


ఇదే సమయంలో నారీశక్తి గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కావడం..నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం నారీశక్తికి గొప్ప ఉదాహరణ అని అన్నారు. 


"తొలిసారి కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నారీశక్తికి ఈ సమావేశాలు అద్దం పట్టనున్నాయి. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లోనే ఇది కనిపించింది. నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం నారీశక్తికి మరో సాక్ష్యం"


- ప్రధాని నరేంద్ర మోదీ 






గత పార్లమెంట్ సమావేశాల్లో సభలో గందరగోళం సృష్టించిన ఎంపీలు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని మండి పడ్డారు. 


"గత పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. అలాంటి వాళ్లంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాంటి వాళ్లను ప్రజలు ఏ మాత్రం గుర్తు పెట్టుకోరు. ఈ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నాను"


- ప్రధాని మోదీ