ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'సిద్ధం' అంటూ సమరశంఖం పూరిస్తే... తెలుగుదేశం పార్టీ 'సంసిద్ధం' అంటూ కౌంటర్ ఇచ్చింది. జనసేన 'మేము సిద్ధమే' అంటూ బరిలో నిలిచింది. ఇప్పుడీ రాజకీయాలు థియేటర్లలోకి వచ్చాయి. జగన్ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ అవుతోంది. మరి, ఏపీ ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి.
ఫిబ్రవరిలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రీ రిలీజ్
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. రాజకీయ నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఇందులో రాజకీయ నాయకుల నిజస్వరూపాన్ని బయటపెట్టే పాత్రలో, జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్ కనిపించారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో రీ రిలీజ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ పెరిగింది. అయితే... ఈ సమయంలో, మరీ ముఖ్యంగా పవన్ సినిమా రిలీజ్ చేయడానికి ఒక కారణం ఉంది. జగన్ సినిమాకు పోటీగా థియేటర్లలోకి వస్తుందీ సినిమా.
ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల
ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర 2'. వైయస్సార్ మరణం నుంచి జగన్ సీయం అయ్యే వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకుల కథగా దర్శకుడు మహి వి రాఘవ్ సినిమా తెరకెక్కించారని సమాచారం. అయితే... ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రీ రిలీజ్ చేస్తుండంతో రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది.
ఏపీ ప్రజల ఓటు ఏ సినిమాకు?
ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజయం సాధించినట్టు లెక్క. మరి, సినిమా పరిశ్రమకు వస్తే... ఎవరి సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తే, ఆ సినిమా హిట్టు! ఫిబ్రవరి 7న రీ రిలీజ్ అవుతున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయా? లేదంటే ఫిబ్రవరి 8న వస్తున్న 'యాత్ర 2'కు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ముందు 'యాత్ర 2' హీరో జీవా ఇమేజ్ చాలా చిన్నది. అయితే, ఆ సినిమాకు జగన్ ఫ్యాక్టర్ ప్లస్. మరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు థియేటర్లకు ఏ మేరకు వస్తారో చూడాలి.
Also Read: వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు... ఏపీ రాజకీయాలు తెలియదు... 'యాత్ర 2' హీరో జీవా ఏమన్నారంటే?
ఇంతకు ముందు రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు రికార్డ్ ఓపెనింగ్స్ సాధించాయి. మరి, 'కెమెరామెన్ గంగతో రాంబాబు'కు ఎంత ఓపెనింగ్ వస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదలైన సమయంలో ఏపీలో అధికార యంత్రాంగం థియేటర్ల దగ్గర స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందరూ ఎన్నికల హడావిడిలో బిజీ కదా!
Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!