ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాను ఎప్పుడూ కలవలేదని కోలీవుడ్ కథానాయకుడు జీవా తెలిపారు. తనకు ఏపీ రాజకీయాల గురించి కూడా అవగాహన లేదన్నారు. మరి, సినిమా ఎలా చేశారని ప్రశ్నిస్తే... ''నేను కథను, అందులో కథానాయకుడి పాత్రను అర్థం చేసుకున్నాను'' అని సమాధానం చెప్పారు‌. జగన్ పాత్రలో జీవా నటించిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు.


జగన్ రోల్ చేయడం టఫ్ టాస్క్! కానీ... 
''యాత్ర 2'ను పూర్తిగా బయోపిక్ అనలేం. ఇది నాయకుడి జీవితానికి సంబంధించిన పార్షియల్ బయోపిక్. దర్శకుడు మహి వీ రాఘవ్ ఈ కథలో మానవ సంబంధాలు, అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాలలోకి ఎక్కువగా వెళ్లలేదు'' అని జీవా చెప్పారు. తనకు తెలుగు మాట్లాడడం రాదని, తాను ఏపీ రాజకీయాలను ఫాలో కానని, అందువల్ల జగన్ పాత్రలో నటించడం కాస్త కష్టమైన పని అని జీవా చెప్పుకొచ్చారు. అయితే‌..‌. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సమాచారం మీడియాలో అందుబాటులో ఉండడంతో పాటు దర్శకుడు చెప్పిన విషయాలను ఫాలో కావడం వల్ల తన పని సులువైందని ఆయన వివరించారు.


'యాత్ర 2' చేయడానికి తొలుత సందేహించా!
రాజకీయ సినిమా కావడంతో 'యాత్ర 2' చేయడానికి తొలుత తాను సందేహించానని జీవా తెలిపారు. అయితే...‌ మహి వీ రాఘవ్ ఈ సినిమా కంటే ముందు తీసిన 'యాత్ర' చూసిన తర్వాత తనకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు. ఇంకా ఈ సినిమా, దర్శకుడు మహి గురించి జీవో మాట్లాడుతూ... ''రాజకీయ నేపథ్యమున్న కథలను తీసుకుని సినిమాలు తెరకెక్కించడంలో మహికి ఒక సపరేట్ స్టైల్, క్లాస్ ఉన్నాయి. తండ్రికిచ్చిన మాటను నెరవేర్చడం కోసం ఒక కొడుకు ఏం చేశాడు? ఆ క్రమంలో, ఆ ప్రయాణంలో ఆ కొడుకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనేది మా సినిమాలో ప్రధాన అంశం'' అని తెలిపారు. 


జగన్... జీవా... ఇద్దరి మధ్య పోలికలు!
ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ మంది ప్రజలకు తెలుసు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. జీవా విషయానికి వస్తే... ఆయన హీరో అవ్వడానికి ముందు నిర్మాత ఆర్.బి. చౌదరి కుమారుడిగా ప్రేక్షకులకు తెలుసు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తండ్రి లెగసీని నిలబెట్టిన కుమారులుగా ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ''జగన్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు... ఇద్దరు కుమార్తెలకు తండ్రి. భార్యను ప్రేమించే భర్త. ఫ్యామిలీకి ఎంతో వేల్యూ ఇస్తారు. నేను కూడా ఫ్యామిలీకి వేల్యూ ఇస్తా'' అని జీవా చెప్పారు.


Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!


ప్రచార చిత్రాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా జీవా నటనకు మంచి పేరు వచ్చింది. మరి, రేపు సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ఇటు చిత్రసీమ, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?