Jharkhand Political Crisis: ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో తరవాత సీఎం ఎవరు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్‌ని ఇప్పటికే ఈడీ ప్రశ్నిస్తోంది. ఆయన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకున్న తరవాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ హేమంత్ సోరెన్ ఈ విషయం చెప్పినట్టు సమాచారం. ఈ నిర్ణయానికి ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన Jharkhand Mukti Morcha Partyలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే...న్యాయపరంగా కల్పనా సోరెన్ సీఎం పదవిని చేపట్టేందుకు కొన్ని చిక్కులు ఎదుర్కోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ గడువు పూర్తయ్యేలా ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఇది రాజ్యాంగపరంగా ఉన్న నిబంధన. అలాంటప్పుడు కల్పనా సోరెన్ ఎమ్మెల్యే అవ్వడమే సవాలుగా మారుతుండొచ్చు. ఈ ఏడాది నవంబర్‌లో ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే...ఇందుకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తరవాత తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. లేదంటే ఆమె స్థానంలో మరో వ్యక్తి సీఎం అవుతారు.
ప్రభుత్వ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల్ని అక్రమంగా మార్చిన కేసులో దాదాపు రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని ఈడీ చెబుతోంది. ఈ భూమిని కొందరు బిల్డర్స్‌కి విక్రయించినట్టు ఆరోపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. అయితే...తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఇదంతా కుట్ర అని తేల్చి చెబుతున్నారు హేమంత్ సోరెన్.
భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటలు ఎదురుచూసినా సోరెన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే, సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 2 బీఎండబ్ల్యూ కార్లు, పలు కీలక దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి వరకూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 31న (బుధవారం) రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన్ను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈడీ అధికారులు విచారించేందుకు వెళ్లిన సమయంలో సోరెన్ అందుబాటులో లేకపోవడంతో 'సీఎం మిస్సింగ్' అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించింది.
Also Read: మలేషియా రారాజు ఇంట్లో 300 లగ్జరీ కార్‌లు, ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు తేలేస్తారు