King Sultan Ibrahim Wealth: మలేషియాకి కొత్త రాజొచ్చాడు. 65 ఏళ్ల జోహార్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (Johor Sultan Ibrahim Iskandar) రాజుగా బాధ్యతలు తీసుకున్నాడు. కౌలాలంపూర్‌లో జరిగిన సమావేశంలో ఈ అధికారికంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ రాచరిక వ్యవస్థ కొనసాగుతోంది. అయితే...ఈ మధ్య కాలంలో ఆ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ఆ వ్యవస్థను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుత రాజు సుల్తాన్ ఇబ్రహీంకి పట్టాభిషేకం చేశారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. 5.7 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనే కింగ్. అంతే కాదు. మైనింగ్‌ గనులూ బోలెడన్ని ఉన్నాయి. టెలీకమ్యూనికేషన్స్‌తో పాటు పామ్ ఆయిల్ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు సుల్తాన్ ఇబ్రహీం. ఆయన అధికారిక నివాసాన్ని చూస్తే ఎంత విలాసంగా గడుపుతున్నాడో అర్థమైపోతుంది. ఇంట్లో 300 లగ్జరీ కార్లున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ 300 కార్లలో ఒకటి అడాల్ఫ్ హిట్లర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇవి కాకుండా ప్రైవేట్‌ జెట్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో బోయింగ్‌ విమానాలున్నాయి. ఆయన కుటుంబానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆర్మీ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందో. 


5.7 బిలియన్ డాలర్లు అనేది కేవలం ఓ లెక్క మాత్రమే. కానీ..అంతకు మించి ఆస్తులున్నాయని తెలుస్తోంది. మలేషియాలో అతి పెద్ద సెల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన U Mobile కంపెనీలో ఏకంగా 24% మేర షేర్‌ ఉంది. ఇవి కాకుండా పలు ప్రైవేట్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు సుల్తాన్ ఇబ్రహీం. సింగపూర్‌లో 4 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాండ్ ఉందని Bloomberg వెల్లడించింది. 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాడు. ఆస్తుల విషయంలోనే కాదు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలోనూ సుల్తాన్ ఇబ్రహీం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సింగపూర్‌, చైనాతో మైత్రి కొనసాగిస్తున్నారు. ఆయన రాజుగా బాధ్యతలు తీసుకున్న తరవాత మలేషియా ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని భావిస్తున్నారు. వాణిజ్య అవకాశాలు పెంచడంలో ఆయన దిట్ట అన్న పేరు ఉంది. ముఖ్యంగా మలేషియాలో భారీ ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చే అవకాశాలున్నాయని స్థానిక రాజకీయ నిపుణులు చెబుతున్నారు.