KCR No To Communists : తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులకు షాకి ఇచ్చారు. వారు పెట్టుకున్న పొత్తుల ఆశలను చిదిమేశారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో కమ్యూనిస్టు నేతల్ని ప్రగతి భవన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. కమ్యూనిస్టుపార్టీల జాతీయ నేతల్ని కూడా ప్రగతి భవన్‌కు పిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో.. కమ్యూనిస్టులతో బంధం ఈ ఒక్క ఉపఎన్నికతో ఆగని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు కనీ సం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు వద్దని కేసీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. అయితే సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే.. చెరో రెండు, మూడు సీట్లు అయినా ఇవ్వాల్సి వస్తుందని.. ఆ సీట్లు త్యాగం చేయడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
దక్షిణ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంటారనే చర్చ ఇటీవల జరిగింది. సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నయి. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయారు. అక్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని ఖచ్చితంగా కమ్యూనిస్టులతో పొత్తులు ఉంటాయని అనుకున్నారు. కాని ఈ సారి కూడా ఒంటరి పోటీకే మొగ్గు చూపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండివ్వడంతో ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చేస్తారనేది సస్పెన్స్ గామరింది. వారు జాతీయ స్థాయిలో I.N.D.I.A కూటమిలో భాగంగా ఉన్నారు. కాంగ్రెస్ అందులో ప్రధాన భాగస్వామ్యపక్షం. కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు మేలు చేస్తాయి. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నాయి. దీంతో కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ తో వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.