BRS Legislature Party meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకున్నారు. ఏయే అంశాలను సభలో లేవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవిత గురించి ప్రస్తావన వచ్చింది.


ఈ సందర్భంగా తన కుమార్తె కవిత గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా తనకు బాధ ఉండదా? అని అన్నారు. కానీ, తాను మాత్రం అగ్నిపర్వతంలా ఉన్నానని అన్నారు. పార్టీలో క్లిష్టమైన పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ లేవని అన్నారు. ఇప్పుడు ఉన్న ఇబ్బందికర పరిస్థితుల కంటే గడ్డు పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించానని గుర్తు చేసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. 


ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే అనే వాడు బాగా ఎదుగుతాడని చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందని.. రాష్ట్రంలో సరైన పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న వారిని తెరపైకి తెచ్చి, వారిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి లేదా ఇతర పదవులు ఇచ్చానని అన్నారు. అలాంటి నేతలు పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని అన్నారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరోవైపు, శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రకటించారు.