KCR In Delhi : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త రాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు చెబుతారని అనుకున్నారు. కానీ కేసీఆర్ రెండు రోజులుగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవి రాజకీయాలకు సంబంధించినవి కాదు. రాష్ట్ర అప్పులకు సంబంధించిన సమావేశాలు.  ఇప్పటికే ఇస్తామన్న అప్పులు రాకపోవడంతో వాటిపై చర్చించేందుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు  కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్  భారీగా రుణాలిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎనభై శాతం రుణాలిచ్చాయి. మరో ఇరవై శాతం రావాల్సి ఉంది.  ప్రాజెక్ట్ పురోగతిని బట్టి ఇవ్వాల్సి ఉది. ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తవుతున్నా ఆ రుణాలు అందడం లేదు.  దీనికి కారణం ఆ సంస్థలు కొత్త రూల్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది.  


కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా - సుప్రీంకోర్టు


తాము ఇచ్చిన రుణానికి కేంద్రం గ్యారంటీ ఇప్పించారని రుణాలిచ్చిన సంస్థలు పట్టుబడుతున్నాయి. అందుకే మిగిలిన రుణం వాయిదా వేశారు. దీనిపై కేసీఆర్ మంగళవారం రోజంతా ఢిల్లీలో చర్చలు జరిపారు. ఆయా సంస్థల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు  ఇచ్చేందుకు... తీసుకునేందుకు జరిగిన ఒప్పందంలో ఎక్కడా కేంద్రం గ్యారంటీ అనే క్లాజే లేదని.. ఇప్పుడు కొత్తగా ఎందుకు పెడుతున్నారని ఆయన మండిపడినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో ఎన్ని చర్చలు జరిగినా..ఆయా ఫైనాన్స్ కార్పొరేషన్లు కాళేశ్వరానికి మిగతా అప్పు మంజూరు చేయాలంటే కేంద్రం గ్యారంటీ తప్పని సరి అని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 


నెటిజెన్ల ట్రోల్స్ - "వర్క్ ఫ్రమ్ హోం" ఫొటోతో మంత్రి కేటీఆర్ రియాక్షన్ !


ఇప్పటికే కేంద్రం .. తెలంగాణకు ఇవ్వాల్సిన అప్పులపై పరిమితి విధించింది. ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ల రుణాలపైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణ సీఎంకు ఆర్థిక పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నట్లుగా భావిస్తున్నారు. అయితే కేంద్రం వద్దకు ఈ పంచాయతీ తీసుకెళ్లలేని విధంగా రాజకీయ వైరం ఉంది. మరో వైపు అప్పులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఢిల్లీలో కేసీఆర్ ఈ అంశాలపై మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.  


ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల అంశంపైనా కేసీఆర్ కొంత మందితో చర్చలు జరిపే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి అయితే తెలంగాణ అప్పలు సమస్యను పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.