KCR Finalized Shambhipur Raju as Malkajigiri MP candidate : మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోటీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తప్పుకోవడంతో శంభీపూర్ రాజుకు అవకాశం ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. శంభీపూర్ రాజు.. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. గతంలో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ గత మూడు ఎన్నికల్లోనూ చాన్స్ లభించలేదు. ఈ కారణంగా కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిక్కెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించే క్రమంలో కేపీ వివేకానంద్ కే కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. మొదట అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత పార్టీ గెలుపు కోసం పని చేశారు. అదే సమయంలో మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చినప్పటికీ పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు ప్లేస్‌లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆసక్తి చూపడంతో ఆయనకు చాన్సిచ్చారు. ఈ కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పా ర్టీ నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పోటీ నుంచి విరమించుకున్నారు. ఈ కారణంగా ఎన్నాళ్ల నుంచో చూస్తున్న టిక్కెట్ శంభీపూర్ రాజుకు లభించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. అన్ని సెగ్మెంట్లలో కలిపి మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. విజయం సునాయాసం అనుకున్నప్పటికీ అభ్యర్థులు వెనుకడుగు వేయడంతో శంభీపూర్ రాజుకు చాన్సిచ్చారు.
30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్‌పై ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. పక్కా వ్యూహంతో బీజేపీ ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా బరిలోకి దిపింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు. కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి బీజేపీ రంగంలోకి దింపింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.