LCA Tejas Crashed in Rajasthan: భారత వాయుసేనకు (IAF) చెందిన యుద్ధ విమానం 'తేజస్' (Tejas) కుప్పకూలిన ఘటన రాజస్థాన్ లోని జైసల్మేర్ (Jaisalmer) లో జరిగింది. శిక్షణా కార్యకలాపాల సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ హోటల్ కాంప్లెక్స్ సమీపంలో కూలిపోగా.. వెంటనే మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన పైలట్ పారాచూట్ సాయంతో ముందుగానే బయటకు రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు భారత వాయుసేన తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన యుద్ధ విమానాల్లో 'తేజస్' ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. 2001లో తొలి టెస్ట్ ఫ్లైట్ మొదలు కాగా.. తేజస్ కూలిపోవడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి..
సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ 'తేజస్' (Tejas)ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 2016లో చేర్చారు. ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్ ను సైతం ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇండియన్ నేవీలోనూ వినియోగిస్తున్నారు. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 'తేజస్'.. 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. అఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్ తీసుకునేలా, గ్రౌండ్ ఆపరేషన్స్ లో క్లోజ్ కంబాట్ సపోర్టును సమకూర్చేలా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం భారత వాయుసేనలో 40 తేజస్ MK - 1 ఎయిర్ క్రాఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మరో 83 తేజస్ MK - 1 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు కోసం ఐఏఎఫ్ ఆర్డర్ చేసింది. 2025 నాటికి పాత కాలపు మిగ్ - 21 ఎయిర్ క్రాఫ్ట్ ల స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 'తేజస్' మార్క్ - 1Aతో భర్తీ చేయాలని ఐఏఎఫ్ నిర్ణయించింది. 2001 జనవరి 4న తొలి తేజస్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరింది.
Also Read: Nayab Singh Saini: హరియాణాలో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం - నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ