BRS First List News :   భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్ల జాబితాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు దక్కాయి. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మాత్రమే మొండి చేయిచూపారు. కాంగ్రెస్ నుంచి  పన్నెండు మంది, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు.                              


టిక్కెట్లు పొందిన కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్లే..
 
ఎల్లారెడ్డి - జాజాల సురేందర్ ,  ఎల్బీ నగర్  - సుధీర్ రెడ్డి,   మహేశ్వరం  - సబితా ఇంద్రారెడ్డి ,  తాండూరు  - పైలెట్​రోహిత్​రెడ్డి , నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య ,  భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి ,  పినపాక - రేగా కాంతారావు ,  ఇల్లెందు - హరిప్రియా నాయక్ ,  కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర్​రావు ,  పాలేరు - కందాల ఉపేందర్​రెడ్డి ,  కొల్లాపూర్ - హర్షవర్ధన్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.  వీరంతా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ెస్‌లోకివచ్చిన వారే.  బోథ్ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మత్రమే.. టిక్కెట్ నిరాకరించారు. అయితే ఆయనకు..  లోక్‌సభ టిక్కెట్  హామీ ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి.                           


పార్టీలో చేరే ముందే టిక్కెట్  హామీ 
  
కొల్లాపూర్‌లో మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. దీంతో అక్కడ హర్షవర్థన్ రెడ్డికి పోటీ లేదు.  ఇక ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి.. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డికి పార్టీ లోని ఇతర సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా..తమకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టినా  కేసీఆర్ సిట్టింగ్‌లకే ఓకే చెప్పారు.  2018లో అచ్చొచ్చిన ఫార్ములానే కేసీఆర్ రిపీట్  చేస్తుననారు.  ప్రజా వ్యతిరేకత, వర్గ విబేధాలు, క్యాడర్‌తో ఇబ్బందులు ఇలా అన్నీ బేరీజు చేసుకున్న తర్వాత సర్వే చేయించగా.. కేసీఆర్ టిక్కెట్లను ఖరారు చేశారు.                          


టీడీపీ నుంచి చేరిన ఇద్దరికీ  అవకాశం


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య,  అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిస్తే .. ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ కండువా  కప్పుకున్నారు. పార్టీలో చేరే ముందే వారికి టిక్కెట్ల హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకునేందుకు టిక్కెట్లను ప్రకటించారు.                             


ఫిరాయింపులు చేసి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడం వల్ల పార్టీని నమ్ముకుని  ఉన్న వారు అసంతృప్తికి గురవుతారని తెలిసినా... కేసీఆర్.. ముందుకే వెళ్లారు. ఈ కారణంగా కొంత మంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరుగుతోంది.