What Next BRS :   భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఏం చేయబోతున్నారు ? తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం అధికారికంగా ముగిసిపోయింది. ఇక నుంచి కేసీఆర్ జాతీయ స్థాయి ఆలోచనలతో రాజకీయాలు చేయనున్నారు. ఎర్రకోటలపై బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఇందు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ సిద్ధం చేసుకోబోబోతున్నారు ? పార్టీ కార్యవర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు ? ఏ స్థాయిలో బీజేపీపై యుద్ధం చేయబోతున్నారు. 


ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే : కేసీఆర్ 


బీఆర్ఎస్ పత్రాలపై సంతకాలు పెట్టిన తర్వాత కేసీఆర్ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.  ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.  ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు.   దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు.. రాజ‌కీయ పార్టీలు కాద‌న్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాల‌న్నారు. 


అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం


రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌న్నారు. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ విధాన ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. 



ముందుగా కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ !


వచ్చే ఏప్రిల్ లోపు.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా  పోటీ చేస్తోంది. జేడీఎస్.. బీఆర్ఎస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి కూడా జేడీఎస్ నేతకుమారస్వామి హాజరయ్యారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని.. అక్కడ కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్నారు కేసీఆర్. అయితే మద్దతు ఇస్తారా.. కొన్ని సీట్లలో పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి జాతీయ రాజకీయాలు


కేసీఆర్ జనవరి నుంచి పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా అన్ని రాష్ట్రాల్లో కార్యవర్గాలను నియమించడంతో పాటు  పార్టీకి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం అనేక పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత... కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా  ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బహిరంగసభలు పెట్టే అవకాశం ఉంది.