CM KCR :  ఎన్నికలు దగ్గర  పడుతూండటంతో సీఎం కేసీఆర్ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా  తెలంగాణలో ధూప, దీప నైవేద్యం   పథకం కింద అర్చకులకు అందించే అలవెన్స్​ను ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు గళవారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  పురాతన కాలం నుంచి, ఆ తర్వాత వెలిసిన ఆలయాల్లో నిత్యం ఆ దేవుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించేందుకు అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన ప్రభుత్వం నిధులు కేటాయించింది.  ధూపదీప నైవేద్యం అలవెన్స్‌లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాజాగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రూ. 10వేలలో అర్చకుల గౌరవ వేతనం కింద రూ.6వేలు, ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు రూ.4వేలు కేటాయించింది.                                  


ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా నిర్ణయించింది. కానీ, ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 2015 జూన్‌ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ఆలయాలకు.. ఇటు అర్చకులకు ఎంతో మేలు చేకూరింది. ఇప్పుడు పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే అలవెన్స్‌లను రూ.10వేలకు పెంచింది.                                                                         
   
ఇటీవల హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా డీడీఎన్‌ కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా, ఇందులో అర్చకులకు 6వేల రూపాయలు, ధూప, దీప నైవేద్యాలకు 4వేల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని మరికొన్ని దేవాలయాలకు కూడా వర్తింపచేస్తామని సీఎం చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం అందుతోంది. భృతిని పొందే అర్హత వయసు 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు సీఎం కేసీఆర్​ తెలిపారు.