Chandrababu comments on alliance :  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటందన్న అంశంపై చంద్రబాబు స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. 


తెలంగాణలో  పొత్తులకు సమయం మించిపోయింది !                       


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీతో పొత్తుల అంశంపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు.. సమయం మించిపోయిందని వ్యాఖ్యానించారు. అంటే.. తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీపై కమిటీ వేశామని.. ఆ కమిటీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 


ఏపీలో పరిస్థితిని బట్టి పొత్తులపై నిర్ణయం                  


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పొత్తులు పెట్టుకునే ఆలోచనలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని సమయానుకూల నిర్ణయం ఉంటుందన్నారు. లోక్‌సభతో పాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మళ్లీ జనసేన, టీడీపీ,  బీజేపీ కూటమి ఏర్పడుతుందని జరుగుతున్న ప్రచారంపై ఆయన పెద్దగా స్పందించలేదు. కానీ పొత్తులతోనే వెళ్తామని పరోక్షంగా చెప్పారు. తెలంగాణలో ఒంటరిపోటీ అన్న ఆయన... ఏపీలో మాత్రం పొత్తులపై ఆలోచిస్తున్నామన్నారు.  బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామన్నది మీకు తెలియదని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. 


ఏపీలో పెద్ద మైనస్ జగనే !                                       


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద మైనస్ సీఎం జగన్మోహన్ రెడ్డేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని ప్రశ్నించిన వారిపై కేసులతో విరుచుకుపడుతున్నారన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టారో  తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాను చూడని రాజకీయం లేదని.. రాజకీయాల్లో జగన్ రెడ్డి ఓ బచ్చా అని  చంద్రబాబు వ్యాఖ్యనించారు. జగన్ విధానాలతో తెలంగాణకు, ఏపీకి  పొంతన లేకుండా  పోయిందన్నారు. ఏపీని ఎలా పునర్మించాలన్నదానిపై తాను ఆలోచిస్తున్నానని తెలిపారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - సౌత్ కొరియా, నార్త్ కొరియా మాదిరిగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేయాలని భావించానని..  మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని జగన్ తీరుపై చంద్రబాబు అసహనం  వ్యక్తం  చేశారు.   పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేదన్నారు.   రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ను గద్దెదించాలన్నారు.



ఇండియా కూటమికి  నాయకుడు లేకపోవడం బీజేపీకి ప్లస్                                             


ఇండియా కూటమి పైనా చంద్రబాబు స్పందించారు.  ఇండియా కూటమికి నాయకుడు లేకపోవడం బీజేపీకి కలిసి వచ్చే అంశమని.. ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసమే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయ అనుభవం ఉన్న వారు ఎవరూ మోదీని విమర్శించడం లేదన్నారు. దేశ నిర్మాణంలో భాగం కావాలన్నది తన ఉద్దేశమని ...అది ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు.  మోడీ భారత్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని..  వాజ్ పెయి,మన్మోహన్ సింగ్ అంతగా అంతర్జాతీయ పర్యటనలు చేయలేదన్నారు.